జి.సిగడాం: మండలంలోని వెలగాడ సచివాలయంలో విద్యుత్ లైన్‌మేన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.ఎర్రయ్య (33) మంగళవారం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విధి నిర్వహణలో భాగంగా ఎర్రయ్య మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో వెలగాడలో ఎల్‌సీ తీసుకుని స్తంభం ఎక్కి విధులు నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న హెవీలైన్ తగలడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
అక్కడి నుంచి కిందకు పడిపోయాడు. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తలకు, గుండెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. ఎర్రయ్యకు భార్య లక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పేద కుటుంబాన్ని ఆదుకోవాలి..
నిరుపేద కుటుంబానికి చెందిన ఎర్రయ్య పుట్టినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కష్టపడి చదివి సచివాలయం ఉద్యోగం సాధించాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలతో ఆనందంగా జీవిస్తున్న తరుణంలో మృత్యువు వెంటాడింది.
ఎర్రయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న ఏఈఈ తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి చేబ్రోలు సురేష్, తోటి ఉద్యోగులు ఎర్రయ్య కుటుంబాన్ని ఓదార్చారు. కాగా, ఎర్రయ్య మృతి వార్త తెలియగానే స్వ్రగామం మధుపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎర్రయ్య మృతిపట్ల సర్పంచ్ బగాది అప్పలనాయుడు, మాజీ సర్పంచ్ నల్లి తవిటినాయుడు, ముగ్గు శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment