విజయనగరం: ఎస్.కోట పట్టణాన్ని మూడు రోజుల కిందట ఉలిక్కి పడేలా చేసిన స్థానిక చందన్ లాడ్జిలో మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్.గోవిందరావు వివరాలు వెల్లడించారు. ఈనెల 30వ తేదీన ఎస్.కోటలోని చందన్ లాడ్జి మేనేజర్ గనివాడ శ్రీనివాసరావు లాడ్జిలో ఒక మహిళ మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హత్య కేసుగా నమోదు చేశాం. ఘటనాస్థలిని పరిశీలించి రూమ్ నంబర్ 103లో మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం పంపించాం. తర్వాత విచారణలో మృతురాలు విశాఖ జిల్లా దేవరాపల్లి గ్రామానికి చెందిన ఆరిపాక ఈశ్వరమ్మగా గుర్తించాం. గత నెల 24న అరకు మండలం ఉరుముల గ్రామానికి చెందిన మాదాల శ్రీరాములు (జనసేన నాయకుడు) చందన్ లాడ్జిలో రూమ్ బుక్ చేశాడు.
ఆ వ్యక్తే హత్యకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది. నిందితుడు మాదాల శ్రీరాములును మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అరెస్టు చేశాం. ఈశ్వరమ్మను ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం హత్య చేసినట్లు నిందితుడు శ్రీరాములు విచారణలో అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు.
డబ్బుల కోసం గొడవపడి..
మృతురాలు ఈశ్వరమ్మ తనకు తెలుసని, ఆమెను లాడ్జికి తానే తీసుకెళ్లానని, తర్వాత డబ్బుల కోసం గొడవ పడ్డామని, ఆ గొడవలో తాను ఆమెను గోడకు గుద్దేయడంతో తలకు గాయమై పడిపోగా తర్వాత మెడకు చీర బిగించి హత్యచేసినట్టు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు. మరుసటి రోజు లాడ్జికి వచ్చి మృతురాలి వంటిపై ఉన్న 4బంగారు గాజులు, దుద్దులు, ఉంగరం తీసుకుని, ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ బ్యాంక్‌లో తాకట్టు పెట్టినట్లు చెప్పాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారంతో ముత్తూట్ బ్యాంక్ నుంచి 60 గ్రాముల బంగారం, నిందితుడి నుంచి రెండు మొబైల్స్, పల్సర్ బైక్, లక్ష రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్సీ గోవిందరావు వివరించారు. హత్య కేసును ఛేదించిన సీఐలు, ఎస్సై ఇతర సిబ్బందిని డీఎస్పీ గోవిందరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment