అధిక ధరలకు విక్రయించిన వారిపై కేసులు
విజయనగరం: వినియోగదారులకు తూనిక ప్రకారం అందించాల్సిన నిత్యావసర వస్తువుల తూకంలో తేడా రావడంతో పాటు ప్యాకింగ్ ధరల కన్నా అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్న వ్యాపారస్తులపై తూనికలు కొలతలు శాఖ అధికారులు దాడులు నిర్వహించి పలు కేసులు నమోదు చేశారు. ఆ శాఖకు సంబంధించిన ఇన్‌స్పెక్టర్ ఎం.దామోదరనాయుడు విజయనగరం రైల్వేస్టేషన్, బస్టాండ్ ఇతర చోట్ల పలు రకాల వ్యాపార సంస్థలపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి మొత్తం 8 కేసులు నమోదు చేశారు. వాటిలో తూనిక యంత్రానికి సీళ్లు లేకపోవడాన్ని గుర్తించి 3 కేసులు నమోదు చేశారు. రైల్వేస్టేషన్, బస్టాండ్‌లలో సామాన్య ప్రయాణికుడిలా పలు దుకాణాల వద్ద శీతల పానీయాలు, తినుబండారాల ప్యాకెట్టు కొనుగోలు చేసి ముద్రించిన అమ్మకపు ధర కంటే అధికంగా విక్రయించినట్లు గుర్తించి వారిపై 5 కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులతో మాట్లాడుతూ వినియోగదారులకు ముద్రించిన ధరకే ప్యాకెట్లు విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు మోసాల పట్ల పలు సూచనలు చేసి ఎవరైనా తూకంలో గాని, కొలతలో గానీ లేదా ప్యాకెట్లపై ముద్రించిన ధర కంటే అధికంగా విక్రయించినట్లు గుర్తిస్తే తమ శాఖకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ తనిఖీల్లో టెక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment