భక్తులకు ఇబ్బందులు కలగరాదు
నెల్లిమర్ల రూరల్: శివరాత్రి ఉత్సవాలకు రామతీర్థం విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ దాట్ల కీర్తి సూచించారు. రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ శివరాత్రి ఉత్సవాల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తరాదని, భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి అధికారి సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని క్యూల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని మున్సిపల్, నగర పంచాయతీ అధికారులకు సూచించారు. క్యూలో ఉన్న భక్తులకు మంచినీరు పంపిణీ చేయాలని, చిన్న పిల్లలను గుర్తించి పాలు అందజేయాలన్నారు. తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలని కోరారు. అనంతరం దేవస్థానం సిబ్బందితో మాట్లాడి ఉత్సవాల విజయవంతానికి చేపట్టిన ఏర్పాట్లపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సుదర్శనరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment