రాయగడ: పట్టణంలో ఈ ఏడాది ఉగాది ఉత్సవాలు పోటీపోటీగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉగాది ఉత్సవ కమిటీ పేరిట 12 ఏళ్లుగా ఉగాది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల క్రితం యాల్ల కొండబాబు నేతృత్వంలో రాయగడ జిల్లా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో వేరేగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీంతో పట్టణంలో రెండు వేదికల్లో ఉగాది వేడుకలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యాల్ల ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను పురష్కరించుకుని స్థానిక కొల్లిగుడ మైదానంలో ముహూర్తపు రాట వేశారు. తాజాగా ఆదివారం స్థానిక తేజస్వీ హోటల్ ఎదురు మైదానంలో నెక్కంటి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలకు ముహూర్తపు రాట వేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, రాఘవ కుముందాన్, శిల్లా జగన్నాథ రావు, ఎన్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీగా బ్యానర్లు..
పట్టణం ఉగాది సంబరాల కోసం ముస్తాబవుతోంది. ప్రతి కూడలిలోనూ నిర్వాహకులు ఉత్సవాల బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సమాఖ్య ఉగాదిని పురష్కరించుకుని పోటీలను నిర్వహిస్తుండగా ఈ నెల 27, 28 తేదీల్లో నెక్కంటి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలకు సంబంధించి వివిధ పోటీలను నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
చందాల వసూళ్లు..!
తెలుగు సమైఖ్యత, సంస్కృతికి అద్దం పట్టే ఈ ఉగాది ఉత్సవాలు ఇదివరకు ఒకే వేదికపై నిర్వహించడంతో పట్టణ ప్రజలు ఉత్సవాలను ఆనందిస్తుండేవారు. క్రమేపీ రెండు గ్రూపులుగా జరుగుతుండటంతో చందాలు చెల్లించే విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఉగాది ఉత్సవాల కోసం స్థానిక విద్యా సంస్థ యాజమాన్యాన్ని నిర్వాహక సంఘానికి చెందిన వ్యక్తి ఫోన్ చేసి పెద్ద మొత్తంలో చందా చెల్లించాలని ఫోన్ ద్వారా బెదిరించడం వంటి ఘటనలు వైరల్ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి స్పందించారు. తెలుగు వారి సమైఖ్యతను చాటి చెప్పే ఈ వేడుకలకు చందాల వసూళ్ల పేరిట బెదిరిస్తుండటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి తప్ప బెదిరింపులకు పాల్పడటం తగదన్నారు.
రాయగడలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు
రాయగడలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు