ఈ వేడుక ఆదర్శం
● చెప్పడం కాదు.. చేసి చూపించారు... ● కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు ● అరటి ఆకుల్లో భోజనాలు ● మట్టి గ్లాసుల్లో తాగునీరు
చీపురుపల్లి: మారిన ఆధునిక సమాజంలో సాంప్రదాయ పద్ధతుల నడుమ నూతన వస్త్రాలంకరణ మహోత్సవం జరిపి మిరియాల వారి కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. శభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే... చీపురుపల్లి పట్టణంలోని వంగపల్లిపేటకు చెందిన మిరియాల రాంబాబు, అనురాధ దంపతుల ఇంట నూతన వస్త్రాలంకరణ మహోత్సవం పేరిట ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. బంధువులు, స్నేహితులను వందల సంఖ్యలో పిలిచారు. అందరూ వచ్చారు.. అక్కడ ఏర్పాట్లు చూసి ఒకింత మెచ్చుకున్నారు. వేడుకలు ఇలాగే చేస్తే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని చర్చించుకున్నారు. వేడుకలో కొబ్బరి కమ్మలతో చలువ పందిళ్లు వేశారు. అరటి ఆకుల్లో భోజనాలు పెట్టారు. మట్టి గ్లాసుల్లో నీరు పోశారు. ఆహ్వానాన్ని కూడా ఓ వస్త్రంపై రాసి ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వద్దు... కాగితం సంచులు ముద్దు... అంటూ నిత్యం ప్రకటనలిస్తూ.. పత్రికలకు ఫొజులిచ్చే వారికి కళ్లు తెరిచేలా ఎక్కడా ప్లాస్టిక్ వస్తువును వాడకుండా వేడుక నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా చేయడంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. దశాబ్దాల కిందట జరిగిన వేడుకలు గుర్తుకొచ్చేలా సాంప్రదాయంగా చేసి అందరినీ ఆకట్టుకున్నారు.