దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు.