వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని అమలు చేయాలి
విజయనగరం టౌన్: వయోశ్రేష్టుల సంరక్షణ చట్టాన్ని ప్రతి జిల్లాలో కచ్చితంగా అమలుచేయాలని ఆలిండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర వయోశ్రేష్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో వయోశ్రేష్టుల రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సబ్‌డివిజనల్ స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి రెవెన్యూ సబ్ డివిజన్ స్ధాయిలో వచ్చే సమస్యలను పరిష్కరించాలని, కలెక్టర్ స్థాయిలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుచేసి జిల్లా స్థాయిలో వచ్చే వయోశ్రేష్టుల సమస్యలను 90 రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి జిల్లాలోనూ కమిటీలు వేసి మూడు నెలలకొకసారి కమిటీ సమావేశం నిర్వహించి వయోశ్రేష్టుల సంక్షేమంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వయోశ్రేష్టుల శేషజీవితం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర్ ప్రార్థన గీతంతో ప్రారంభమైన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరమేశ్వర రెడ్డి, కార్యదర్శి రామచంద్రరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, సత్యనారాయణమూర్తి, వెంకటరమణ, తదితరులు దివంగత కేపీ ఈశ్వర్ మృతిపట్ల మౌనం పాటించారు. సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎస్.కుప్పూరావు, ప్రతినిధులు త్రినాథప్రసాద్, బసవమూర్తి, జగన్నాథరావు, గిడుతూరి పైడితల్లి, అధిక సంఖ్యలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.