వంటావార్పుతో కార్మికుల ఆందోళన
వేపాడ: మండలంలోని బొద్దాంలో చెక్‌పోస్టువద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు బుధవారం వంటావార్పుతో ఆందోళన నిర్వహించారు. చెక్‌పోస్టు ఎత్తివేయాలని లేదా వెసులుబాటు కల్పించాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనపై స్పందించిన ఉత్తరాంధ్ర మైన్స్ అండ్ జియాలజీ విజిలెన్స్ ఎ.డి. అజయ్‌కుమార్ బొద్దాం చేరుకుని సమస్యపై ఆరాతీశారు. దీనిపై సీఐటీయూ జిల్లానేత చల్లాజగన్ మాట్లాడుతూ ప్రైవేట్ చెక్‌పోస్టు సిబ్బంది, విజిలెన్స్ బోర్డులు పెట్టుకుని అక్రమాలుచేస్తున్నారని ఎ.డికి వివరించారు. రైతులు సొంత పొలాల్లో నుంచి మట్టితోలుకున్నా, గృహనిర్మాణదారులు పునాదులు పూడ్చుకోవడానికి తెచ్చుకున్నా అక్రమంగా వసూలు చేస్తున్నారని ఈ ఇబ్బందుల నుంచి రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లకు విముక్తి కలిగించాలని కోరారు. దీనిపై ఎ.డి.అజయ్‌కుమార్ మాట్లాడుతూ మట్టి, కారురాయి తోలకాలకు మినహాయింపు కల్పిస్తామన్నారు. అయితే లే అవుట్‌ల వ్యాపారాలకు తోలేవాటికి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ చెక్‌పోస్టుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. దీంతో కార్మికులు ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఎ.జి.మల్లేశ్వర్రావు, బొద్దాం గ్రామపెద్ద ఎర్రా సన్యాసిరావు, యూనియన్ నాయకులు గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, శ్యామ్, కృష్ణ, రవి, శివప్రసాద్, రామకృష్ణ, బాలు, సన్నిబాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై దేవి, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.