
జీవో నంబర్ 35ను సవరణ చేయాలి
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 35ని తక్షణమే సవరించాలని పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిలారి నారాయణరావు కోరారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న పాలనా సంస్కరణలను తామంతా స్వాగతిస్తున్నామన్నారు. అయితే జీవో నంబర్ 35తో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పరిపాలనాధికారులుగా పనిచేస్తున్నవారికి ఎంపీడీవోలుగా పదోన్నతుల కోటాలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఎంపీడీవోలుగా పదోన్నతుల్లో జెడ్పీ, మండల పరిషత్ ఉద్యోగులకు 34 శాతం, పంచాయతీ విస్తరణాధికారి (ఇవోపీఆర్డీ)లకు 33 శాతం, అలాగే డైరక్ట్ నియామకాలకు 30 శాతం, ఇతరులకు 3 శాతం చొప్పున కేటాయింపు ఉండేదని గుర్తు చేశారు.
34 శాతం కేటాయింపు దారుణం
ప్రస్తుతం ఎంపీడీవోల పోస్టులకు డైరక్ట్ నియామకాలను ప్రభుత్వం రద్దుచేసి, పదోన్నతులతో భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ లెక్కన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం పదోన్నతుల కోటా 50 శాతం వరకు తమకే కేటాయింపులు ఇవ్వాల్సి ఉందని కిలారి నారాయణరావు అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 34 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లుగా ప్రస్తావిస్తూ జీవో విడుదల చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా జిల్లా పరిషత్, మండల పరిషత్ క్యాడర్ స్ట్రెంత్‌ను దృష్టిలో పెట్టుకుని తమకు పదోన్నతుల్లో 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లేదంటే రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని ప్రకటించారు. సమావేశంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి కింజరాపు నర్సింహమూర్తి, జిల్లా మహిళ ఉద్యోగుల సంఘ అధ్యక్షురాలు పి.జయమ్మ, జెడ్పీ యూనిట్ ప్రతినిధి మాసపు సంతోష్‌కుమార్, రాష్ట్ర సంఘ ప్రతినిధులు కె.మురళీకృష్ణ పట్నాయక్, సీపాన రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిలారి