ప్రత్తిపాడు: కుటుంబ సభ్యుల కళ్లెదుటే మహిళ సజీవదహనమైన హృదయవిదారక ఘటన ప్రత్తిపాడులో జరిగింది. ప్రత్తిపాడు ఎస్‌ఐ డి.రవీంద్రబాబు కథనం ప్రకారం ప్రత్తిపాడుకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు కొత్తా ఆదిలక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. ఆస్తుల విషయమై చిన్నకూతురు సుజాత (45) కుటుంబానికి, ఆదిలక్ష్మికి మధ్య వివాదం తలెత్తింది. చిన్నకూతురుతోపాటు ఆమె కుటుంబమంతా తన ఇంట్లో ఉంటూ, తనను కొట్టి చిత్రహింసలు పెడుతోందంటూ ఆదిలక్ష్మి ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. కొద్దిరోజుల కిందట ప్రత్తిపాడుకు వచ్చిన ఎమ్మెల్యేనూ కలిసి గోడును వెల్లబోసుకుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం స్థానికుల సమక్షంలో ఆదిలక్ష్మి, పెద్దకుమార్తె కోటేశ్వరి తమ ఇంటి పోర్షన్‌కు హద్దు గోడ నిర్మించుకునేందుకు కూలీలను తీసుకువచ్చారు. దీంతో చిన్న కూతురు సుజాతకు, ఆది లక్ష్మికి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి సుజాత పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుంది. అగ్గిపెట్టెతీసి వెలిగిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఆమె 14 ఏళ్ల కొడుకు వద్దమ్మా అంటూ ప్రాధేయపడినా ఆమె వినలేదు.
అగ్గిపెట్టే గీయడంతో చీరకు మంట అంటుకుని క్షణాల వ్యవధిలో అగ్నికీలలు సుజాత దేహమంతా వ్యాపించాయి. దీంతో స్థానికులు దూరంగా పరుగులు తీశారు. కొడుకు, కుటుంబ సభ్యుల ఎదుటే ఆమె పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతిచెందినట్టు నిర్ధారించారు. ప్రత్తిపాడు ఎస్‌ఐ రవీంద్ర ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment