ప్రేమజంట ఆత్మహత్య
కులాంతర వివాహానికి ఒప్పుకోని పెద్దలు
పెదకాకానిలో రైల్వే ట్రాక్‌పై బలవన్మరణం
పెదకాకాని: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఓ ప్రేమజంట శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన దానబోయిన సాంబశివరావు దంపతుల చిన్న కుమారుడు మహేష్(22) రెండేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ సెల్‌ఫోన్ షోరూంలో పని చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నండ్రు వెంకయ్య, విజయ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.
చిన్న కుమార్తె శైలజ కూడా అదే సెల్‌ఫోన్ షోరూంలో ఉద్యోగంలో చేరింది. మహేష్, శైలజల మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కొంతకాలం కిందట హైదరాబాద్ నుంచి శైలజ తిరిగొచ్చి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఇదిలా ఉండగా, ఈ నెల 10వ తేదీన ఆస్పత్రికి వెళ్లిన శైలజ ఫోన్ స్విచ్ఛాప్ అయింది.
వారం కిందట నందిగామ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. వారం కిందట ఇంటి నుంచి కొంత నగదుతో బయటకెళ్లిన మహేష్ తిరిగి రాలేదు. శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఇద్దరూ బైక్‌పై పెదకాకాని భ్రమరాంబపురం ఆర్చి సమీపంలో రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. బైక్, వారి వద్ద ఉన్న బ్యాగ్‌లు అక్కడే పెట్టి ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు మహేష్ కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని రైల్వే సీఐ అంజిబాబు, ఎస్‌ఐ రమేష్‌లు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment