చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మద్యం తాగి తరచూ తల్లిని వేధింపులకు గురించేస్తున్న కుమారుడిని హత్య చేసిన ఘటనలో తల్లి, మైనర్ బాలికతో పాటు ఖలీమ్ ఆలీఖాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గత నెల 27వ తేదీన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందగా, తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో తల్లి చెప్పిన కొన్ని అంశాలు అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. తొలుత అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారా అనే దిశగా దర్యాప్తు చేపట్టారు. దీంతో తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి సీఐ చెప్పిన వివరాలు ఇవి..
కొత్తపేటకు చెందిన మద్దూరి దేవకుమార్(19) చిన్నతనం నుంచి చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తల్లి మాధవిని వేధించేవాడు. దేవకుమార్ తాను పని చేస్తే వచ్చే డబ్బులతో పాటు తల్లి హోటల్‌లో పని చేసి సంపాదించిన డబ్బులను కూడా ఇవ్వాలని తరచూ బెదిరింపులకు పాల్పడేవాడు. కుమారుడి వేధింపులు ఎక్కువ కావడంతో తల్లి మాధవీ తీవ్రంగా ఆందోళన చెందేది. ఈ క్రమంలో గత నెల 27వ తేదీ ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన దేవకుమార్ తల్లిని బెదిరించాడు. అర్ధరాత్రి వేసి గ్యాస్ లీక్ చేసి చంపేస్తానన్నాడు. దీంతో తల్లి భయంతో పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.
తెల్లవారుజామున హత్య..
అర్ధరాత్రి బంధువుల ఇంటికి వెళ్లిపోయిన మాధవి ఇంట్లో జరిగిన గొడవను తనతో పాటు హోటల్‌లో పని చేసే తాడేపల్లి మహానాడుకు చెందిన ఖలీమ్ ఆలీఖాన్‌కు చెప్పింది. దీంతో ఎలా అయినా దేవకుమార్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకుని తల్లి మాధవి, తన కుమార్తెతో కలిసి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి వద్దకు వచ్చిన ఆలీఖాన్‌తో కలిసి మంచంపై నిద్రస్తున్న దేవకుమార్ కాళ్లు, చేతులు తలో వైపు పట్టుకోగా, గొంతు నులిమి హత్య చేశారు.
తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్లిన మాధవి ఉదయం వచ్చి తన కుమారుడు చనిపోయాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు పోలీసుల విచారణలో జరిగిన వ్యవహారం అంతా బయటకు వచ్చింది. హత్యకు పాల్పడిన మాధవి(45), బాలిక(17)తో పాటు ఆలీఖాన్(33)ను పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment