లోకేష్‌ పలాయన యాత్ర | - | Sakshi
Sakshi News home page

లోకేష్‌ పలాయన యాత్ర

Published Sun, Aug 13 2023 1:32 AM | Last Updated on Sun, Aug 13 2023 12:08 PM

- - Sakshi

పల్నాడు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పుకోలేక పల్నాడులో లోకేష్‌ యువగళం పాదయాత్ర పలాయన యాత్రగా ముగిసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు ఒకటిన వినుకొండ నియోజకవర్గంలో మొదలై మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో శనివారంతో ముగిసిన యాత్ర మూగబోయిందని టీడీపీలోని సీనియర్లే పెదవి విరుస్తున్నారు.

పగటి నడక తక్కువ రాత్రి యాత్ర ఎక్కువ అన్న చందంగా సాగిన యువగళం వలన అటు పార్టీకై నా, ఇటు తమకై నా ప్రయోజనం ఎంతమేరకు ఉంటుందని తమ అనుయాయులతో బేరీజు వేసుకున్న నాయకులు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారనేది పార్టీ వర్గాల సమాచారం. పల్నాడు ప్రాంతంలో ఆయా పార్టీల క్యాడర్‌కు కట్టుబడి ఉండే తత్వం వలన అక్కడక్కడా హడావుడి కనిపించిందే తప్ప అదనంగా కలిసొచ్చిన ప్రయోజనం కనీసమైనా లేదని ముఖ్యనేతలు వాపోతున్నారనేది సమాచారం.

► సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధి ఇంతలా ఉంది... మరి మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో చెప్పమని ఎక్కడికక్కడ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఛాలెంజ్‌లకు టీడీపీ నుంచి కనీస స్పందన కరవైంది. పల్నాడు జిల్లా పరిధిలో ఎక్కడికై నా, ఎప్పుడైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా మాట పెగల్లేదు. సింగడు అద్దంకికి పోనూ పోయాడు, రానూ వచ్చాడన్న చందంగా లోకేష్‌ యువగళం పాదయాత్ర మిగిలిపోయిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతుండటం పరిశీలనాంశం.

ఎక్కడికక్కడ ప్రగతి పనులతో....
సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతెంత వెచ్చించామనే వివరాలను శాసనసభ్యులు స్పష్టంగా తెలియజేయడం నియోజకవర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. గత, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య పనితీరుపై బేరీజుకు, అవగాహనకు వీలుకలిగింది. ప్రభుత్వం ఎవరెవరికి ఏయే ప్రయోజనాలను కలిగించిందనేది గడప గడప వద్దకు నాయకులు వెళ్లి వివరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకేమైనా మీకు చేయాల్సిన పనులు మిగిలిపోయాయా చెప్పండంటూ ప్రభుత్వమే ప్రత్యేకంగా అడిగి తెలుసుకుని మరీ పూర్తి చేస్తోంది.

► లోకేష్‌ నడిచే దారిలో ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి తమ నియోజకవర్గ అభివృద్ధిని బొల్లా బ్రహ్మనాయుడు వివరించడం స్థానికులను ఆలోచింపచేసినవే. వినుకొండ పట్టణ దాహార్తిని తీర్చిన వైనాన్ని, కొనసాగుతున్న వాటర్‌గ్రిడ్‌ పనులు, హార్టికల్చర్‌ కళాశాల, వంద పడకల ఆసుపత్రి, రామలింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణ, పేదలకు 5118 ఇళ్ల నిర్మాణం తదితరాలన్నీ ప్రజల కళ్లెదుట కనిపిస్తున్నాయి. నెలకు రూ.4 కోట్లు చొప్పున తాగునీటి సరఫరాకు ఖర్చుచేశామన్న దాంట్లో ఎంత బొక్కారో చెప్పండన్న ఎమ్మెల్యే బొల్లా ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానం కరవైంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్న సవాల్‌కు జవాబు లేకపోయింది.

► తాము చెబుతున్న వాటిపై నేరుగా చర్చించడానికి ఎప్పుడైనా, ఎక్కడికై నా వస్తామని చాలెంజ్‌ చేశారు ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి. చర్చకు తానొక్కడే రావడానికి సిద్ధమంటూ సెల్ఫీ ఛాలెంజ్‌లు సైతం విసిరారు. పిడుగురాళ్లలో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ, 89 వేల ఇళ్లకు తాగునీటి వసతి కల్పన పనులు, పిడుగురాళ్ల పట్టణంలో రూ.942.30 కోట్లతో పనులు, రూ.1500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, 18,789 మంది పేదలకు ఇంటి నివేశన పట్టాలు, ఆటోనగర్‌ అభివృద్ధి తదితర ప్రగతిని వివరిస్తూ మీ హయాంలో ఏం చేశారో చెప్పాలని చేసిన సవాళ్లకు టీడీపీ నుంచి ఉలుకూపలుకూ లేదు.

► దివంగత మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా వ్యవహరించినప్పుడు, ప్రస్తుత సీఎం నేతృత్వంలో మాచర్ల ప్రగతిని పిన్నెల్లి రామకష్ణారెడ్డి సవివరంగా వెల్లడిస్తూ పల్నాడు ప్రజలను టీడీపీ మోసగించడం తప్ప మరేం చేసిందని నిలదీశారు. వెల్దుర్తి మండల పరిధిలో 1996, 2019లో వరికపూడిసెలకు చంద్రబాబు శంకుస్థాపన చేపి వదిలేశారని, తాజాగా లోకేష్‌ కూడా డ్రామా నడిపారని ఎద్దేవా చేశారు. కొప్పునూరు, అనుపు లిప్ట్‌ ఇరిగేషన్‌ , సత్రశాల టెయిల్‌ పాండ్‌ డ్యాం, మాచర్ల పట్టణంలో నాలుగేళ్లలో రూ.2600 కోట్లతో ప్రగతి పనులు, నియోజకవర్గ పరిధిలోని మూడు జాతీయ రహదారుల అభివృద్ధి, యాభై పడకల ఆసుపత్రి ఆధునికీకరణ, 20 వేల మందికి ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను వివరిస్తూ టీడీపీ ఏం చేసిందనే ప్రశ్నలకు లోకేష్‌, బృందం నుంచి జవాబు కొరవడింది.

► సత్తెనపల్లికి ఫలానా శాశ్వత అభివృద్ధి పనులు చేశామని చెప్పుకునేందుకు ఏమీలేక ఎక్కడో సభతో సరిపెట్టుకుని లోకేష్‌ పలాయనం చిత్తగించారని మంత్రి అంబటి రాంబాబు తూర్పార పట్టారు. సత్తెనపల్లి వాసుల చిరకాల కోరికై న రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధితో పాటు 96 మంది వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం, ప్రమాదాలకు నెలవుగా ఉన్న పేరేచర్ల – కొండమోడు మార్గం 49.91 కి.మీలను నాలుగు వరుసలుగా విస్తరణ పనులు, రూ.491.46 కోట్లతో సంక్షేమం, రూ.172.15 కోట్లతో అభివృద్ధి పనులు, అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌, తండాలను పంచాయతీలుగా చేయడం తదితరాలను గుర్తుచేస్తూ మీ హయాంలో ప్రగతి ఏదనే అంబటి ప్రశ్నకు లోకేష్‌ నుంచి సమాధానం లేదు.

► పెదకూరపాడును ఏమాత్రం పట్టించుకోని టీడీపీకి ప్రస్తుత ప్రగతి పనులు మింగుడు పడనీయడం లేదు. రూ.2032.67 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వివరిస్తూ మీ సంగతేంటని నిలదీస్తున్నారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై రూ.60.54 కోట్లతో వంతెన నిర్మాణం, అమరావతి – రాజుపాలెం మధ్య రూ.148.95 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్‌ అభివృద్ధి, క్రోసూరులో పాలిటెక్నిక్‌ కాలేజీ, కస్తూర్భా పాఠశాల, గురుకుల పాఠశాలలో భవన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనులు, వివిధ సామాజికవర్గాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు.. వాటిని ఎమ్మెల్యే వివరించడం టీడీపీకి నోటమాట రాకుండా చేస్తోంది. తమ ప్రత్యర్థులపై స్థానిక నాయకులు రాసిచ్చిన అబద్ధపు ఆరోపణల స్క్రిప్టులను చదవడం, తమ ప్రభు త్వ హయాంలో చేసిందేమీ లేక చెప్పుకోలేకపోవడం, వైఎస్సార్‌ సీపీ ప్రతినిధుల చాలెంజ్‌లకు స్పందించ లేకపోవడంతో పల్నాడులో లోకేష్‌ యువగళం పాదయాత్ర పలాయనయాత్రగా ముగిసిందనేది పరిశీలకుల అభిప్రాయం.

వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేయించిన ఫ్లెక్సీలు (ఫైల్‌)

ప్రగతిపై వైఎస్సార్‌ సీపీ సవాళ్లకు స్పందనేది సెల్ఫీ ఛాలెంజ్‌లకూ జవాబు లేదాయె అభివృద్ధిపై మూగబోయిన యువ‘గళం’ నేతల అబద్ధపు ఆరోపణల స్క్రిప్టులతో సరి యువగళం యాత్రపై టీడీపీ సీనియర్ల పెదవి విరుపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement