కేంద్రం మెచ్చిన భూ సర్వేపై చంద్రన్న విషం! | - | Sakshi
Sakshi News home page

కేంద్రం మెచ్చిన భూ సర్వేపై చంద్రన్న విషం!

Published Sat, Jul 27 2024 1:12 AM | Last Updated on Sat, Jul 27 2024 12:36 PM

-

 భూముల రీసర్వే చేయాలంటున్న ఎన్డీయే సర్కారు 

 భూసంస్కరణలు పూర్తిచేస్తే 50 ఏళ్లపాటు సున్నావడ్డీ రుణాలు, భూ వివాదాలు పరిష్కారం 

గత ఐదేళ్లలో చేసి చూపించిన నాటి జగన్‌ ప్రభుత్వం 

 విష ప్రచారంతో అడ్డుకున్న కూటమి 

 జిల్లాలో ఇప్పటికే రెండు విడతలు పూర్తి 

నిజం నిధానంగా తెలుస్తుందన్నది పెద్దలమాట. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన భూ సమగ్ర సర్వే వల్ల కలిగే ప్రయోజనం ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో సుస్పష్టమైంది. భూ సర్వేతో భూ వివాదాలకు పరిష్కారం లభించడంతో పాటు సర్వే పూర్తయిన రాష్ట్రాలు 50 ఏళ్ల పాటు సున్నావడ్డీ రుణాలు తీసుకునే వెసులబాటు ఉందన్నారు. ఈ ప్రకటనతో ఎన్నికల్లో భూ సర్వేపై నానాయాగీ చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు నోరు మెదపలేకపోతున్నారు. ల్యాండ్‌టైట్లింగ్‌ యాక్టును రద్దుచేసిన కూటమి ప్రభుత్వం భూ సర్వేపై యూటర్న్‌ తీసుకున్న తీరు ఇప్పుడు పల్లెల్లో చర్చనీయాంశంగా మారింది. నాటి ప్రభుత్వ కృషిని రైతన్నలు ప్రశంసిస్తున్నారు. 
 

సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రాల్లో భూ సంస్కరణలు, భూముల రీసర్వే, భూ రికార్డుల డిజిటలీకరణ అత్యావశ్యకమని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. భూముల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు సున్నావడ్డీకి రుణాలిచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రతిపాదించారు. ప్రజలకు మేలు చేసేలా అదే సంస్కరణలను రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తే.. విష ప్రచారం చేస్తూ, కూటమి నాయకులు అడ్డుకున్నారు. తాజాగా కేంద్రం ప్రతిపాదించిన రోజునే భూసంస్కరణలకు తిలోదకాలిచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఆమోదింపజేసుకుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలనే అన్ని రాష్ట్రాలూ ఇప్పుడు అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేయడం గమనార్హం.

దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపేలా..
దశాబ్దాల భూసమస్యకు చెక్‌ పెట్టేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే ప్రక్రియను అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా రైతులు భూసంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాతతండ్రుల కాలం నాటి రెవెన్యూ రికార్డుల్లో సరైన వివరాలు లేక, హద్దులు తెలియక వివాదాలు పడిన ఉదంతాలు అనేకం. ఈ నేపథ్యంలోనే గత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం’ ద్వారా భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. రీసర్వే కోసం సర్వే ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన రేఖాంశాలు, అక్షాంశాలు గుర్తించి హద్దులు నిర్ణయించారు. 

గ్రామాల సరిహద్దుల నుంచి నివాస ప్రాంతాల ఇళ్లు, ఖాళీ స్థలాల వరకు మొత్తం ఇమేజ్‌లతోపాటు హద్దులు పక్కాగా వచ్చేవి. దీనివల్ల కేంద్రం చెప్పినట్లు కొత్త డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి భూమికీ జియో కోఆర్డినేట్స్‌ హద్దులు ఏర్పర్చడం, ఐడీ నంబరు, క్యూఆర్‌ కోడ్‌ జారీ ద్వారా దేశంలో కొత్త భూవ్యవస్థను పరిచయం చేశారు. ప్రతి భూమికీ ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌, భూహక్కు పత్రం, ప్రతి గ్రామానికీ రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌ అందించారు. 

కొన్ని వేల పట్టాలకు సబ్‌ డివిజన్లు చేశారు. భూముల హద్దులను నిర్ధారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతించారు. మన రాష్ట్రంలో జరిగిన రీసర్వే దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం కూడా జై కొట్టింది. అలాంటి మంచి కార్యక్రమంపై చంద్రబాబు అండ్‌ కో దుష్ప్రచారానికి దిగారు. రైతుల పాస్‌ పుస్తకాలపై నాటి ముఖ్యమంత్రి జగన్‌ ప్రచారయావతో ఫొటోలు వేయించుకున్నారని, భూములన్నీ లాక్కొంటారని లేనిపోని భయాందోళనలు కలిగించారు.

కోట్లాది రూపాయల ఖర్చు.. వేలాది మంది శ్రమ
మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 965 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొదటి విడత 95, రెండో విడత 153 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారు. మూడో విడత 107 గ్రామాలు లక్ష్యంగా ప్రక్రియను ప్రారంభించారు. అది మధ్యలో ఉండగానే.. ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ముందుకు కదలలేదు. జిల్లాలో మొత్తం భూముల విస్తీర్ణం 5,78,016 ఎకరాలు కాగా.. 1,75,877 ఎకరాల్లో సర్వే పూర్తయింది. 557 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశారు. 

రెండు విడతల్లో కలిపి 3,09,341 సర్వే రాళ్లను పాతారు. రీసర్వేలో రోవర్‌లను వినియోగించారు. సర్వే ఆఫ్‌ ఇండియా, గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టం, డ్రోన్‌ టీం, హై ప్రిసన్‌ లెవెల్‌ బృందాలతోపాటు.. గ్రామ, మండల సర్వేయర్లు పని చేశారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసేందుకు కోట్లాది రూపాయలను వెచ్చించారు. ఇప్పుడు సర్వే ప్రక్రియను నిలిపివేయడంతో వందలాది మంది ఉద్యోగుల శ్రమ, కోట్లాది రూపాయల నిధులు వృథా అయ్యాయి.

మొదటి నుంచి ఈ కార్యక్రమంపై గుర్రుగా ఉన్న కూటమి నాయకులు.. అధికారంలోకి రాగానే, దానిని నిలుపుచేస్తూ, అసెంబ్లీలో బిల్లుపెట్టి తమ వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కేవలం నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మీద అక్కసుతోనే కూటమి నేతలు మోకాలడ్డారు. ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం సూచించడంతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది.

మంచి కార్యక్రమం
భూముల రీసర్వే చాలా మంచి కార్యక్రమం. దశాబ్దాల నాటి భూసమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశించాం. అది పూర్తయితే గ్రామాల్లో భూ సంబంధిత వివాదాలకు తావుండదు. ప్రజోపయోగకర కార్యక్రమాలను ఎవరు చేసినా హర్షించాలి. పార్టీలకతీతంగా స్వాగతించాలి. – బలగ మన్మథరావు, రైతు, పాలకొండ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement