అప్పుల ఆంధ్రప్రదేశ్ ఘనత చంద్రబాబుదే
సాలూరు రూరల్: రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు, అభివృద్ధి పనులకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పులుచేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక వెనుజులా, మరో శ్రీలంకగా తయారవుతుందని ఆరోపించిన చంద్రబాబునాయుడు... ఇప్పుడు తను చేస్తున్న అప్పులు ఎవరికోసం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాలూరులోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎన్నికల్లో లబ్ధిపొందిన చంద్రబాబు... ఇప్పుడు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ప్రజావ్యతిరేకతకు భయపడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న భయంతో వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడంలేదన్నారు. ఢిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి గతంలో ప్రతిపక్ష హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల సమక్షంలో ఎండగడతామన్నారు. తొమ్మిది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసినది శూన్యమన్నారు. గతంలో కేవలం 10 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి 1.35 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందన్నారు. కూటమి ప్రభుత్వం సున్నా సంక్షేమంతో రికార్డు కెక్కిందన్నారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, కొత్తపెన్షన్లు, కాంట్రాక్టు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ, వలంటీర్లకు రూ.10వేల జీతం వంటి హామీలన్నీ సున్నాగానే మిగిలాయన్నారు. అంగన్‌వాడీల వేతనం పెంపు, ఉద్యోగుల పీఆర్‌సీ, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందని ద్రాక్షగానే మారాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్ గిరిరఘు, మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రూ.లక్ష కోట్లు అప్పుచేసిన చంద్రబాబుకు ఇప్పుడు వెనుజులా, శ్రీలంక
గుర్తురాలేదా?
జగన్ చేసిన అప్పులకు లెక్కలున్నాయి
చంద్రబాబుచేసిన అప్పులకు లెక్కలు చూపించగలరా?
బడుగు బలహీనవర్గాలతో మూడు ముక్కలాట ఆడుతున్న కూటమి ప్రభుత్వం
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
Comments
Please login to add a commentAdd a comment