రాత్రి 11గంటల తరువాత సంచరించొద్దు
విజయనగరం క్రైమ్: సహేతుకమైన కారణం లేకుండా అర్ధరాత్రి నగరంలో తిరిగితే టౌన్ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని బ్యారెక్స్ వద్ద ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా పోలీస్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విజయనగరంలో రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, మూడు లాంతర్లు, కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రైతుబజార్, రింగు రోడ్డు, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, జమ్ము, వీటీ అగ్రహారం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను పోలీసులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. రాత్రి 11గంటల తరువాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వారిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేసు నమోదు చేసిన వారిని స్టేషన్‌కు పిలిపించి, వారి తల్లిదండ్రులను రప్పించి, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇప్పటివరకు రాత్రి గస్తీల్లోను, పెట్రోలింగ్ నిర్వహించడంలో మౌలికమైన మార్పులను చేపట్టారు. రాత్రి పెట్రోలింగ్, గస్తీ విధులకు వెళ్లే పోలీసు సిబ్బందితో సంబంధిత పోలీసు అధికారులు సమావేశమై, రాత్రి గస్తీలో నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశానిర్దేశం చేస్తున్నట్లు చెప్పారు. ఇక రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది తమ వెంట తప్పనిసరిగా విజిల్స్, లాఠీలను తప్పనిసరిగా తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. కాగా జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఇప్పటివరకు 850 మందిపై టౌన్ న్యూసెన్స్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించామని ఎస్పీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment