ఈ నెల 8న కొడుకు ఆత్మహత్యాయత్నం
చికిత్స పొందుతూ మృతి
తల్లిపై దాడికి యత్నించిన స్థానికులు
అడ్డుకొని, బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు
జగ్గాసాగర్‌లో ఘటన
మెట్‌పల్లిరూరల్: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు 16 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనికి అతని తల్లి మందలించడమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల ఎదుటే ఆమైపె దాడికి యత్నించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌కు చెందిన ఏనుగు ప్రభాస్(19) హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. ఈ నెల 8న ఇంటివద్దే క్రిమిసంహార మందు తాగాడు. కుటుంబసభ్యులు పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిజామాబాద్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకెళ్లారు. కాగా, జాబ్ చేయాలంటూ తల్లి మందలించడంతో ప్రభాస్ మనస్తాపానికి గురై, ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి ప్రతాప్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తల్లిపై దాడికి యత్నించిన గ్రామస్తులు
ప్రభాస్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారని తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అతని మృతికి తల్లే కారణమంటూ ఆగ్రహంతో ఆమైపె దాడికి యత్నించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వద్దని చెప్పినా వారు వినిపించుకోలేదు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమెను ఇంట్లో ఉంచి, రక్షణ కల్పించారు. ఒక దశలో స్థానికులు ఆ ఇంటిపైకి రాళ్లు విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంట్లోకి చొచ్చుకెళ్లి, దాడికి చేసేందుకు ప్రయత్నించడంతో మెట్‌పల్లి ఎస్సై–1 చిరంజీవి, ఎస్సై–2 రాజు, సిబ్బంది ఆమెను చాకచక్యంగా తమ వాహనంలో కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్‌రావు, సీఐ నిరంజన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ గ్రామానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నిలిచిన అంత్యక్రియలు
ప్రభాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, 4 ఎకరాల భూమి మృతుడి తల్లి పేరిట ఉన్నాయి. వాటిని బుధవారం అతని తండ్రి ప్రతాప్‌కు బదలాయించాకే అంత్యక్రియలు జరుగుతాయని గ్రామస్తులు తెలిపారు.
రెండు రకాల ఫిర్యాదులు
ప్రభాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతని తండ్రి ప్రతాప్ గల్ఫ్ నుంచి వచ్చాడు. మొదట పాయిజన్ ఇచ్చి, హత్యాయత్నం చేశారని భార్యతోపాటు మరొకరిపై ఫిర్యాదు చేశాడు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. మంగళవారం మాత్రం జాబ్ చేయమని తల్లి మందలించిందని, ఆ కారణంగానే పాయిజన్ తీసుకున్నాడని మరో ఫిర్యాదు చేశాడు. ఇలా భిన్నమైన కారణాలు చూపుతూ రెండు ఫిర్యాదులు చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment