
ఇసుక తోడేళ్లు
సాక్షి, పెద్దపల్లి: నిర్మాణాల్లో ఇసుక కీలకమైనది. ఈ సహజవనరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. ప్రధానంగా రామగుండంలో ఇసుక దందా అనుమతులు లేకుండానే జోరుగా సాగుతోంది. అక్రమార్కులు రూ.కోట్లలో దండుకుంటున్నారు. అనధికార రీచ్‌ల్లో ఇష్టారీతిన వెలికితీస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఈ దందాలో అధికార పార్టీ నేతలే బుక్ పెట్టి తరలిస్తూ ట్రాక్టర్ల వివరాలు నమోదు చేస్తున్నారు. పట్టపగలే వందలాది వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా, అక్రమ రవాణాను పట్టించుకునే వారే లేకుండా పోయారు.
నిబంధనల ప్రకారం ఇలా జరగాలి..
సామాన్యులకు ఇసుక అవసరమైతే అందుబాటులోని అనుమతిగల రీచ్ నుంచి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అవసరం ఉన్నవారు తొలుత మీసేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవాలి. దూరాన్ని బట్టి ధర నిర్ణయించి ఎక్కడ నుంచి ఎక్కడకు, ఎన్నిగంటల్లోగా రవాణా చేయాలనే నిబంధనలతో జనవరి 16 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం జిల్లాలోని 6 రీచ్‌ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అవకాశం కల్పించారు. సుల్తానాబాద్ సమీప నీరుకుల్ల, గట్టెపల్లి, ముత్తారంలోని ముత్తారం, అడవి శ్రీరాంపూర్, మంథనిలోని విలోచవరం, అంతర్గాంలోని గోలివాడ రీచ్‌లలో ఎక్కడినుంచైనా ట్రాక్టర్లలో ఇసుక తీసుకు వెళ్లవచ్చు.
సొంత అవసరాలకే ఉచితం..
రీచ్‌ల నుంచి ఉచితంగా తీసుకెళ్లే ఇసుకను సొంత అవసరాలకే వినియోగించాలి. అదికూడా మనజిల్లా పరిధిలోనే వాడాలి. ఎక్కడ కూడా ఇసుక డంప్‌లు చేయడానికి వీలు లేదు. ఇతర ప్రాంతాలకూ తరలించవద్దనేది అధికారుల సూచనలు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుక తరలించాలి. ఆ తర్వాత ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్‌చేస్తారు. తొలిసారి పట్టుబడితే రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి చిక్కితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.
ఇలా జరుగుతోంది..
రామగుండం పరిధిలోని గోలివాడలోనే ఇసుక రీచ్‌కు అనుమతి ఇచ్చారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనుమతి లేకుండానే ఎఫ్‌సీఐ ఫిల్టర్ బెడ్ ఏరియా, మేడిపల్లి శివారులోని గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. స్యాండ్ ట్యాక్సీ ద్వారా రామగుండం పరిఽధిలో ఎక్కడైనా ట్రాక్టర్‌కు రూ.2,600 ధరతో సరఫరా చేయాలి. అక్రమార్కులు అనుమతులు లేకుండానే రూ.1,800 చొప్పున సరఫరా చేస్తున్నారు. విషయం తెలిసినా.. అధికార పార్టీ నేతలు ప్రమేయం ఉండడంతో రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యథేచ్చగా రవాణా
అనుమతి లేకున్నా భారీగా తరలింపు
మామూళ్ల మత్తులో మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు
చర్యలు తీసుకుంటాం
ఇది రామగుండం సమీపంలోని
గోదావరి నదిలో గల ఎఫ్‌సీఐ ఫిల్ట్‌ర్‌బెడ్. పట్టపగలే ట్రాక్టర్లలో ఇలా ఇసుక నింపుతున్నారు. అధికార పార్టీ నేతలు కొందరు ఒక్కో ట్రాక్టర్‌కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఓ పుస్తకంలో రాసుకుంటూ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. స్యాండ్ ట్యాక్సీ ద్వారా ట్రాక్టర్ రూ.2,600 చొప్పున ధరతో పోయాల్సి ఉండగా, లెక్కాపత్రం లేకుండా రూ.1,800కే పోస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. మేడిపల్లి రీచ్‌లోనూ ఇదే
దందా చేస్తున్నారు.
రామగుండం పరిధిలోని ఎఫ్‌సీఐ ఫిల్టర్ బెడ్, మేడిపల్లి వద్ద గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దేవాలయం నిర్మాణం కోసమని ఇసుక తవ్వకాలు చేపట్టి, అక్రమంగా డంపులు ఏర్పాటు చేయడం, సరఫరా చేయడం నేరం. ఇలాంటివారిపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్, మైనింగ్ ఏడీ

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు
Comments
Please login to add a commentAdd a comment