
అప్పుడే మంచినీటి గోస
● కార్మిక కాలనీల్లో తిప్పలు ● గోదావరిలో తగ్గిన పారకం
గోదావరిఖని: వేసవికి ముందే గోదారి తడారుతోంది. నీటి నిల్వలు లేక ఎండిపోతోంది. సింగరేణి కా ర్మిక కాలనీల్లో మంచినీటి గోస మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో రెండ్రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోది. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలాఉంటే వేసవిలో దాహం తీర్చుకునేదెలా? అని కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సమస్య పరిష్కారం కోసం యాజమాన్యం కసర్తు చేస్తోంది.
రోజూ 35 ఎంఎల్‌డీ నీరు సరఫరా..
రామగుండం రీజియన్‌లోని మూడు ఏరియాలకు ప్రతీరోజు 35 మెగా లీటర్స్ ఫర్ డే(ఎంఎల్‌డీ) నీటిని గోదావరి నది నుంచి కార్మిక కాలనీలకు సింగరేణి యాజమాన్యం సరఫరా చేస్తోంది. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, పోతనకాలనీ, సెంటినరీకాలనీల్లోని సింగరేణి క్వార్టర్లు, ప్రైవేట్ నివాసాలకు కూడా సింగరేణి నల్లాల ద్వారా తాగునీరు అందిస్తోంది. ఈసారి సుందిళ్ల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో నీటినిల్వలు లేక గోదావరి నది బోసిపోయి కనిపిస్తోంది. సింగరేణి యాజమాన్యం గోదావరిలో తవ్వించిన వాటర్ ఫిల్టర్లు ఇసుకతెన్నల మధ్యలో కనిపిస్తున్నాయి. కొద్దిపాటి నీటిని నిల్వ చేసేందుకు బండ్‌లాగా ఏర్పాటు చేసింది. అయినా నీటి సమస్యకు పరిష్కారం లభించడంలేదు.
గోదావరి నదిలో వ్యర్థ జలాలే..
రామగుండం నగరం నుంచి వెలుబడే వ్యర్థాలు మల్కాపూర్ సమీపంలోని గోదావరి నదిలో నేరుగా కలుస్తున్నాయి. ఇదేనీరు ఫిల్టర్ బెడ్‌వరకు చేరుతోంది. ఇసుకలో ఫిల్టర్ అయిన నీటిని పంపింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. గోదావరిలో ఇసుక మేటలు తేలాయి. ఇన్‌ఫిల్టరేషన్ గ్యాలరీ వద్ద కూడా నీటి పారకం లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలివారంలోనే గోదావరి పరిస్థితి ఇలా ఉంటే రాబోయే నాలుగు నెలలు ఎలా నెట్టుకు వచ్చేదని సింగరేణి యాజమాన్యం తల పట్టుకుంటోంది.
రోజువారీ నీటిసరఫరా(ఎంఎల్‌డీలో)
సమాచారం ఆర్జీ–1 ఆర్జీ–2 ఆర్జీ–3
నీటిసరఫరా 20 10 05
సింగరేణి 7,500 6,000 1,000
ప్రైవేట్ 15,000 6,000 1,000

అప్పుడే మంచినీటి గోస
Comments
Please login to add a commentAdd a comment