రాచపుండు సలుపుతోంది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాచపుండు(క్యాన్సర్) ప్రాణాలను కబళిస్తోంది. వ్యాధి గురించి తెలుసుకునేలోపే ప్రాణాలు హరించుకుపోతున్నాయి. జిల్లాలో ఇటీవల క్యాన్సర్ రోగుల సంఖ్య భారీగా పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తుంది. అసలు క్యాన్సర్‌కు కారణాలు తెలియక ప్రజలు భయపడుతున్నారు. ప్రధానంగా ఈ వ్యాధి మహిళలో ఎక్కువ వస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా బాధితులు వెయ్యికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 160 మంది రోగుల్లో 120 మందికి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైద్యం అందుతోంది. మిగతా వారు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ‘సాక్షి’ ఫోకస్.
నారాయణపూర్, లింగన్నపేటల్లోనే అత్యధికం
జిల్లా వ్యాప్తంగా అధికారుల లెక్కల ప్రకారం 160 మంది రోగులు ఉంటే నారాయణపూర్ గ్రామంలో 10కి పైగా, లింగన్నపేటల్లో 67 మందికి పైగా బాధితులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వాస్తవంగా మూడింతలకు పైగానే బాధితులు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఇటీవల ఆయా గ్రామాల్లో వరుస మరణాలు సంభవించడం భయాందోళనకు గురిచేస్తుంది.
కారణాలు తెలియక అయోమయం
క్యాన్సర్ వ్యాధి రావడానికి గల కారణాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అత్యధిక కేసులు గల గ్రామాలలో కనీసం ఫాస్డ్‌ఫుడ్ సెంటర్లు కూడా లేవు. ఇప్పటి వరకు క్యాన్సర్‌లతో మరణించిన వారు సైతం దురలవాట్లు లేని వారే. అయినా మరణిస్తుండడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు జిల్లాలో ఎక్కువగా క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో పర్యటిస్తే కారణాలు తెలియవచ్చనే భావన గ్రామస్తుల్లో వ్యక్తమవుతుంది.
ఎక్కువగా ఇవే..
● మహిళల్లో ఎక్కువగా బ్రెస్డ్, సర్వైకల్ క్యాన్సర్‌లు సోకుతున్నాయి. ఈ రెండు రకాల క్యాన్సర్‌లతో జిల్లాలో 87 మంది బాధపడుతున్నారు.
● నోటిక్యాన్సర్‌తో 26 మంది ఇబ్బంది పడుతున్నారు.
● ఇతర క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు 47 మంది ఉన్నారు.
గుర్తిస్తే కాపాడవచ్చు
ఎలాంటి క్యాన్సర్‌లను అయినా మొదటి స్టేజీలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మన శరీరంలో కొత్తగా మార్పులు వస్తున్నాయంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌లను వారే సులభంగా గుర్తించవచ్చంటున్నారు. బ్రెస్ట్‌లో చిన్న సైజులో గడ్డలు కొత్తగా ఏర్పడితే వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలంటున్నారు. అదే సమయంలో ఎక్కువగా దగ్గు రావడం, రక్తం వాంతులు కావడం, తరచూ రక్తహీనతతో బాధపడుతుంటే క్యాన్సర్‌లకు దారి తీయవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కబళిస్తున్న క్యాన్సర్
గుర్తించేలోపు మృత్యువాత
లింగన్నపేట, నారాయణపూర్‌లలో అత్యధిక మరణాలు
అధికారికంగా జిల్లాలో 160 మంది బాధితులు
అనధికారికంగా వెయ్యికి పైగా కేసులు
అవగాహనతోనే నివారించవచ్చంటున్న వైద్యులు
ఇది గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామం. ఈ ఊరిలో జిల్లా వైద్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం క్యాన్సర్ రోగులు 67 మంది వరకు ఉన్నారు. అసలు క్యాన్సర్ వ్యాధి ఎందుకొస్తుందో తెలియక గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 160 క్యాన్సర్ కేసులుంటే ఒక్క ఈ గ్రామంలోనే 67 మంది బాధితులు ఉన్నారు. వ్యాధి గురించి తెలుసుకొని, వైద్యులకు చూయించుకునేలోపే తీవ్రమై ప్రాణాలు పోతున్నాయి.
వైద్యులకు అన్ని చెప్పుకోవాలి
ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా వైద్యులకు అన్ని చెప్పుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఫస్ట్ స్టేజీలో ఉంటే వందశాతం బతికించవచ్చు. రెండో స్టేజీలో ఉన్నప్పుడు గుర్తిస్తే చికిత్సతో 80 శాతం వరకు వ్యాధిని నయం చేసే అవకాశాలు ఉన్నాయి. మూడు, నాలుగు స్టేజీలలో ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. ప్రధానంగా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మాడిపోయిన, పాసిపోయిన ఆహారపదార్థాలు అసలే తీసుకోవద్దు. శరీరంలో కొత్తగా ఏదైనా గడ్డలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో ఎక్కువగా బ్రె స్ట్, పురుషుల్లో లివర్ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
– డాక్టర్ రామకృష్ణ,
క్యాన్సర్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment