అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

Published Fri, Feb 14 2025 10:26 PM | Last Updated on Fri, Feb 14 2025 10:25 PM

అనుమా

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

కథలాపూర్‌(వేములవాడ): కథలాపూర్‌ మండలం పోసానిపేట గ్రామశివారులో సాయికుమార్‌(26) అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రానికి చెందిన జక్కుల సాయికుమార్‌కు పోసానిపేటకు చెందిన మానసతో ఆరేళ్ల క్రితం వివాహమైందన్నారు. సాయికుమార్‌ ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చి వెళ్లరని తెలిపారు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో ఈనెల 12న కథలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. గురువారం ఉదయం పోసానిపేట గ్రామశివారులోని వ్యవసాయబావిలో సాయికుమార్‌ మృత దేహం కనిపించిందన్నారు. మృతుడి తండ్రి జక్కుల మల్లేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై వివరించారు.

కారు ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం

ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామంలో గురువారం కారు ఢీకొని గీతకార్మికుడు మ్యాడగొని శంకర్య(52) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కిన శంకరయ్య.. తన బైక్‌పై ఇంటకి బయలు దేరాడు. ఈ క్రమంలో అజాగ్రత్తగా కారునడుపుకుంటూ వచ్చిన సాయిశ్వేతన్‌ వెనుక నుంచి శంకరయ్యను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శంకరయ్య మృతిచెందాడు. మృతుడికి భార్య రాధ, కుమారుడు మ్యాడగొని శ్రీకాంత్‌గౌడ్‌, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

మతిస్థిమితంలేని వ్యక్తి మృతి

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వేగేట్‌ సమీపంలో గత నెల 30న ఓ వ్యక్తి ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12గంటలకు మృతిచెందాడు. అయితే మృతుడికి మతిస్థిమితం లేదని, పేరు అడిగితే రాజయ్య అని, ఊరు బోనగిరి అని చెప్పాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. కుటుంబసభ్యులు, బంధువులు మృతుడిని గుర్తించినట్లయితే కరీంనగర్‌రూరల్‌ పోలీసులను సంప్రదించాలని సీఐ ప్రదీప్‌కుమార్‌ సూచించారు.

కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

తంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్కల దాడిలో తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఓబులాపూర్‌కు చెందిన చెల్ల శ్రీవర్దన్‌ కుటుంబం గురువారం ఇందిరమ్మకాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా కుక్కలు దాడి చేశాయి. కుటుంబసభ్యులు వాటిని తరిమికొట్టి, తీవ్రంగా గాయపడిన శ్రీవర్దన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కల బెడద తీవ్రంగా ఉందని, అధికారులు దూరంగా తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

బైక్‌ దొంగల అరెస్టు

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌లో బైక్‌ దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు కరీంనగర్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం ఈ నెల 4న సుభాశ్‌నగర్‌కు చెందిన తిరుపతి తన స్నేహితుడిని రైలు ఎక్కించేందుకు బైక్‌పై కరీంనగర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. బైక్‌ను పార్కింగ్‌ చేసి రైలు ఎక్కించి తిరిగి వచ్చి చూసేసరికి బైక్‌ కన్పించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం 8గంటలకు అపోలోరీచ్‌ ఆస్పత్రి వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా మెట్‌పల్లికి చెందిన షేక్‌మదర్‌, పవన్‌కుమార్‌లు దొంగిలించిన బైక్‌పై వస్తుండగా పట్టుకున్నారు. రైల్వేస్టేషన్‌లో మరోబైక్‌ను దొంగిలించేందుకు వస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు.

కారు బోల్తా

మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం రాంపూర్‌ గ్రామశివారులో గురువారం కారు బోల్తా పడిండి. రాంపూర్‌కు చెందిన బత్తుల రమేశ్‌తో పాటు మరో ముగ్గురు మహిళలు కాసారం వెళ్లి, రాంపూర్‌కు తిరిగి వస్తుండగా.. వడ్డెర కాలనీ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారు దెబ్బతినగా, అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.

యువకుడిపై దాడి.. నలుగురిపై కేసు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కల్లు చోరీకి వచ్చాడన్న అనుమానంతో ఓ యువకుడి పై స్థానిక గౌడ కులస్తులు దాడి చేసిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం సింగా రంలో చోటుచేసుకుంది. ఎస్సై రమాకాంత్‌ వివరాల ప్రకారం.. సింగారానికి చెందిన వాసరి భరత్‌కుమార్‌(26)కు పుట్టుకతోనే కంటిచూపు సరిగా కనిపించదు. ఈ నెల 8న రాత్రి 11.30 గంటలకు కల్లు డిపో వద్ద ఉండగా.. గౌడ కులస్తులు ముస్లిం కిష్టయ్య, గుడిసె నాగరాజు, జాగిరి సంతోష్‌, గనగోని శ్రీనివాస్‌ కల్లు దొంగతనానికి వచ్చాడేమోనన్న అనుమానంతో అతన్ని తాడుతో కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. బాధితుడి తల్లి లత ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి1
1/2

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి2
2/2

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement