
వసూలు 20 శాతమే
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరంలో నల్లా బిల్లులు వసూలు కావడం లేదు. బకాయిలు భారీగా ఉండడంతో ఎలా వసూలు చేయాలనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పా లకవర్గం ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటిని స రఫరా చేస్తున్నా.. బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. భారీ బకాయిలే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. 31 మార్చితో 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈనెల 14వ తేదీ వరకు కేవలం 20 శాతం మాత్రమే నల్లా బిల్లులు వసూలు చేయగలిగారు. ఆర్థిక సంవత్సరం ముగిసే దశకు వచ్చినా నల్లా బిల్లుల వసూళ్లలో పురోగతి కనిపించడం లేదు.
డిమాండ్ రూ.11.97 కోట్లు..
రామగుండం నగరంలో మొత్తం 40,728 వరకు నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటిపై రూ.11.97 కోట్ల వరకు డిమాండ్ ఉంది. నగరంలో కేవలం 12 మాత్రమే కమర్శియల్ నల్లా కనెక్షన్లు ఉండగా, ఇందులో తొమ్మిది కనెక్షన్ల నుంచి మాత్రమే ప్రతినెలా రూ.400 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. సుమారు 4,800 నల్లా కనెక్షన్ల వినియోగదారులు నల్లా బిల్లులు చెల్లించడం లేదు.
వసూలు చేసింది రూ.2.08 కోట్లు
ఈ ఆర్థిక సంవత్సరం చివరి దశకు చేరుతున్నా నల్లా బిల్లుల బకాయిల వసూళ్లలో పురోగతి కనిపించడం లేదు. తాగునీటి విభాగంలో ప్రతీనెల నల్లా బిల్లులు వసూలు చేయడానికి ప్రత్యేకంగా బిల్ కలెక్టర్లు పనిచేస్తున్నారు. అధికారుల ఆదేశాలతో డివిజన్లలో వారు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇటీవల విధుల్లో చేరిన జూనియర్ అసిస్టెంట్లకు వార్డు ఆఫీసర్లుగా బాధ్యతలు కూడా కేటాయించారు. ఈనెల 15వ తేదీ వరకు కేవలం రూ.2.08కోట్ల వరకే వసూలు చేయడంపై బల్దియా కమిషనర్(ఎఫ్‌ఏసీ) అరుణశ్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లుగా వసూలు కానివి రూ.4.41 కోట్లు..
రామగుండం బల్దియాలో నల్లా కనెక్షన్ల ద్వారా సుమారు రూ.4.41కోట్ల వరకు బకాయిలు వసూలు కావడం లేదు. ఇవి ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. తాగునీటి సరఫరాలో తరచూ ఏర్పడుతున్న లోపాలు, పైప్‌లైన్లు నిర్మించిన కొద్దిరోజులకే లీకేజీలు, నీటి ప్రవాహం వేగం తక్కువగా ఉండడం, నల్లా కనెక్షన్లు ఇచ్చిన వాటికి నీటిని సరఫరా చేయకపోవడం, చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వకపోడం తదితర కారణాలతో వినియోగదారులు బిల్లలు చెల్లించడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
నల్లా బిల్లుల వసూలు తీరు ఇలా..
సంవత్సరం డిమాండ్ వసూలు శాతం రూ.కోట్లలో రూ.కోట్లలో
2018–19 3.31 1.72 52
2019–20 4.07 1.77 44
2020–21 2.29 1.75 37
2021–22 5.75 2.32 40
2022–23 7.68 2.31 30
2023–24 9.72 2.31 25
2024–25 11.97 2.08 20 (ఈనెల 14వరకు)
డిమాండ్ రూ.11.97 కోట్లు
వసూలైంది రూ.2.08 కోట్లు
నత్తనడకన నల్లాబిల్లుల వసూలు
బల్దియాలో కనెక్షన్లు 40,728
లక్ష్యం సాధిస్తాం
బల్దియాలో ఆస్తిపన్నుతోపాటు నల్లాబిల్లుల వసూలుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. ఇందుకోసం ప్రత్యేకంగా 25 యంత్రాలు తెప్పిస్తున్నాం. లక్ష్యం మేరకు బిల్లులు వసూలు చేసేలా ప్రతీరోజు పర్యవేక్షిస్తాం.
– అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్‌ఏసీ)

వసూలు 20 శాతమే
Comments
Please login to add a commentAdd a comment