
ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
గోదావరిఖని: వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో రామగుండం రీజియన్‌లోని సింగరేణి ఓబీ కాంట్రాక్టు కార్మికులు రెండురోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఓసీపీల్లో మట్టి వెలికి తీత పనులు నిలిచిపోయాయి. జీడీకే–5 ఓసీపీ పీసీ పటేల్, ఓసీపీ–3లోని ఆర్‌వీఆర్, ఓసీపీ–3 పేజ్–2లోని వీ–9 ఓబీ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 2వేల మంది విధులు బహిష్కరించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు.
మూడేళ్లుగా వేతనాలు పెంచలే
డ్రైవర్లు, బ్లాస్టింగ్ హెల్పర్లు, మెకానికల్ హెల్పర్లకు వేతాలు పెంచాలని కొంతకాలంగా కోరుతున్నారు. వీరితోపాటు వివిధ విభాగాల్లో పనిచేసేత కార్మికులకు మూడేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదు. ఈసారి డ్రైవర్లకు రూ.6వేలు, బ్లాస్టింగ్ హెల్పర్లకు రూ.4వేలు, మెకానికల్ హెల్పర్లకు రూ.3వేల చొప్పున పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవిషయంలో గతంలో ఒప్పందం జరిగినా.. అమలు చేయడం లేదంటున్నారు.
సమ్మె విచ్ఛిన్నానికి యత్నాలు..
నిబంధనల ప్రకారం తమకు వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మె చేస్తున్నామని, అయితే, దీనిని విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులను రంగంలోకి దించారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను ఇక్కడకు తీసుకొచ్చి బందోబస్తు మధ్య ఓబీ పనులు చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. సమ్మె నేపథ్యంలో ఓబీ క్యాంపు కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి సంస్థ బాధ్యత తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలి కార్మికులు కోరుతున్నారు.
మిగిలింది 40 రోజులే..
ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రస్తుతం సింగరేణి ఆధ్వర్యంలో ఓబీ పనులు కొనసాగుతున్నా.. పూర్తిగా ప్రైవేట్‌పై ఆధారపడిన జీడీకే–5 ఓసీపీలో మట్టి వెలికితీత పనులు స్తంభించాయి. దీని ప్రభావం బొగ్గు ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు మరో 40రోజుల గడువు మాత్రమే ఉంది.
వేతనాలు పెంచాలని డిమాండ్
నిలిచిన మట్టి వెలికితీత పనులు
కోలిండియా వేతనాలు అమలు చేయాలి
వేతనాలు పెంచాలని కార్మికులు అనేక సార్లు విన్నవించినా ప్రైవేట్ ఓబీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతోనే స మ్మెకు దిగాల్సి వచ్చింది. కాంట్రాక్టు కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలి. – కుమారస్వామి,
అధ్యక్షుడు, సీఐటీయూ
జోక్యం చేసుకోవాలి
కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి సింగరేణి జోక్యం చేసుకోవాలి. మూడేళ్లుగా వేతనాలు పెంచుతామని చెప్పినా.. ఇప్పటివరకు పెంచలేదు. దీంతో ఇబ్బంది పడుతు న్నాం. విధుల విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తు కాంట్రా క్ట్ ఓబీ యాజమాన్యం వేతనాలు పెంచడంలేదు. – సిరాజుద్దీన్,
కాంట్రాక్టు కార్మికుడు,ఆర్వీఆర్ కంపెనీ

ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె
Comments
Please login to add a commentAdd a comment