...అనే నేను!
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా అభ్యర్థుల పేర్లు ● విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి ● భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ ● తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ ● సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు
సాక్షిప్రతినిధి,కరీంనగర్●:
కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్‌ఆర్‌ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు.
మార్పు కనిపించింది వీరిలోనే..
గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్‌ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్‌రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్‌రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్‌బీ బీఫామ్‌పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్‌రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్‌అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్‌లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు.
...అనే నేను!
Comments
Please login to add a commentAdd a comment