విద్యార్థులపై ‘దృష్టి’
● ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో మరోసారి కంటి పరీక్షలు
● కళ్లద్దాల పంపిణీకి సమాయత్తం
● గోదావరిఖని జీజీహెచ్, పెద్దపల్లిలో శిబిరాలు
● రోజుకు 100 మంది విద్యార్థులకు సైట్ నిర్ధారణ
కళ్లద్దాలు పంపిణీ చేస్తాం
దృష్టిలోపం, కంటి సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ 16 రోజుపాటు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. మరోసారి కంటి పరీక్ష చేయడం ద్వారా సైట్ ఏవిధంగా ఉందో తెలుస్తుంది. సైట్ ఆధారంగా కళ్లద్దాలను పంపిణీ చేస్తాం.
– డాక్టర్ అన్నప్రసన్న కుమారి, డీఎంహెచ్‌వో
కోల్‌సిటీ(రామగుండం): పిల్లల చూపు మసకబారుతోంది. దీంతో తమ పుస్తకాలను చదవడం, రాయడంతో పాటు బ్లాక్ బోర్డుపై టీచర్లు ఏం రాస్తున్నారో కనిపించకపోవడంతో పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాది జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు దృష్టిలోపాలున్న విద్యార్థులతో పాటు ఇతర కంటి సమస్యలున్న వారిని గుర్తించారు. ఇలాంటి విద్యార్థులందరికీ కళ్లద్దాలివ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగానే జిల్లాలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు సైట్ ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు సోమవారం నుంచి మరో సారి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 1,674 మందికి దృష్టిలోపం
జిల్లాలో 580 ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న 29,542 మంది విద్యార్థులకు గతేడాది కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,674 మంది విద్యార్థులకు దృష్టిలోపం, 139 మంది విద్యార్థులు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు.
జీజీహెచ్, పెద్దపల్లిలో టెస్టులు
గోదావరిఖని జీజీహెచ్‌తో పాటు పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. క్యాంపుల్లో దృష్టిలోపం, ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో క్యాంపులో 50 మంది చొప్పున రెండు క్యాంపుల్లో రోజుకు 100 మందికి కంటి పరీక్షలను చేస్తున్నారు.
ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో విద్యార్థుల తరలింపు
దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి సైట్ ఏమేరకు ఉందో తెలుసుకునేందుకు మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తున్న క్యాంపులకు ఆయా పాఠశాలల నుంచి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే)కు చెందిన వాహనాల్లో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు తరలిస్తున్నారు. టెస్టులకు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా బిస్కెట్స్, వాటర్ బాటిళ్లు అందిస్తున్నారు. కంటి పరీక్షలు పూర్తయ్యాక తిరిగి వారిని వారి పాఠశాలల్లో వదిలి పెడుతున్నారు.
కంటి పరీక్షలు ఇలా..
వైద్య బృందాలు: 02
కంటి పరీక్షలు నిర్వహించిన పాఠశాలు 580
పరీక్షించిన విద్యార్థుల సంఖ్య 29,452
దృష్టి సమస్యలు ఉన్న విద్యార్థులు 1,674
ఇతర కంటి సమస్యలు ఉన్న విద్యార్థులు 139
విద్యార్థులపై ‘దృష్టి’
Comments
Please login to add a commentAdd a comment