పెద్దపల్లిరూరల్: యాసంగిలో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో గురువారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి సమీక్షించారు. ఈ సీజన్‌లో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకాంత్, డీఎంవో ప్రవీణ్‌రెడ్డి, డీఏవో ఆదిరెడ్డి, డీసీవో శ్రీమాల, డీఎస్‌వో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టిసారించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో విద్యాప్రమాణాల పెంపుపై హెచ్‌ఎం లు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. పాఠశాలల్లో గుణాత్మక విద్య మెరుగుపర్చేందుకు హెచ్‌ఎంల పర్యవేక్షణ కీలకమన్నారు. సమగ్రశిక్ష సమన్వయకర్త పీఎం షేక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేత
రామగుండం ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని శ్రీజకు కలెక్టర్ శ్రీహర్ష ల్యాప్‌టాప్ అందజేశారు. 8వ తరగతిలో తల్లిని కోల్పోయిన శ్రీజ పదో తరగతిలో 983 మార్కులు సాధించి ప్రతిభ చూపింది. ఇంజినీరింగ్ చదువుకు ల్యాప్‌టాప్ అవసరమని ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ స్పందించి ల్యాప్‌టాప్ అందజేశారు.