‘ఎల్‌ఆర్‌ఎస్’తో ప్రయోజనాలు
● దరఖాస్తుదారులు రాయితీని సద్వినియోగం చేసుకోండి ● రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎల్‌ఆర్‌ఎస్ కావాల్సిందే ● ‘సాక్షి’ తో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య
పెద్దపల్లిరూరల్: ‘ఇంటి స్థలాలు, ప్లాట్లు గలవారు తప్పనిసరిగా క్రమబద్ధీకరణ(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం–ఎల్‌ఆర్‌ఎస్ ) చేసుకోవడమే మేలు. 2020లో ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం 25శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు. మండల కేంద్రాలు, వాటికి సమీప గ్రామాలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న భూముల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టేవారు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవడమే మేలని ఆయన సూచించారు. లేఔట్ లేని భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం ఎల్‌ఆర్‌ఎస్ అవసరమన్నారు. ప్లాట్లు క్రయవిక్రయాలకూ ఎల్‌ఆర్‌ఎస్ చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.
సాక్షి: అవసరాల కోసం ప్లాటు అమ్ముకోవచ్చా?
డీపీవో : కొనుగోలు చేసుకున్న ప్లాటును అమ్ముకోవాలన్నా, అందులో ఇల్లు కట్టుకోవాలన్నా కచ్చితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేసుకోవాల్సిందే. ఎల్‌ఆర్‌ఎస్ కట్టిన ప్లాట్‌ను సు లభంగా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. విక్రయించే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించి ఆ ప్రొసీడింగ్‌తోనూ విక్రయించుకోవచ్చు.
సాక్షి: ఇంటి నిర్మాణానికి ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధం ఏమిటి?
డీపీవో : ఇల్లు కట్టుకునే స్థలం కచ్చితంగా క్రమబద్ధీకరించుకోవాల్సిందే. లే ఔట్ నిబంధనలు పాటించని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. ఆవాస యోగ్యంగా మారిన తర్వాత ఆ ప్రాంతంలో పంచాయతీ అధికారులు, సిబ్బంది ద్వారా సేవలను పొందవచ్చు.
సాక్షి: భూమి కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రంతో దరఖాస్తు చేసుకునే వీలుందా?
డీపీవో : భూమి కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్‌తో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వరు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు అవసరమైన నిబంధనలకు లోబడి లేదు. ఎల్‌ఆర్‌ఎస్ చేసుకున్న ప్లాటులో మాత్రమే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి సులువుగా అనుమతి పొందవచ్చు.
సాక్షి: ప్రభుత్వం ప్రకటించిన రాయితీ వర్తించేది ఎవరికి?
డీపీవో : ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం లే ఔట్ నిబంధనలకు లోబడి లేకుంటే 2020లోగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నవారి కోసం ప్రభుత్వం 25శాతం రాయితీ ప్రకటించింది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగానే ఎల్‌ఆర్‌ఎస్ రుసుం చెల్లించొచ్చు.
సాక్షి: ఇంటి నిర్మాణానికి రుణం పొందడంలో సమస్యలు ఉంటాయా?
డీపీవో : ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. రుణం మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేస్తారు.
సాక్షి: ఎల్‌ఆర్‌ఎస్‌తో కలిగే ప్రయోజనాలేమిటి?
డీపీవో : ఎల్‌ఆర్‌ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం. లే ఔట్ నిబంధనలు పాటించని భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు తప్పనిసరిగా ఎల్‌ఆర్‌ఎస్ చేయాల్సిందే. 2020 నాటికి కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతులు, విక్రయిస్తే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
‘ఎల్‌ఆర్‌ఎస్’తో ప్రయోజనాలు