
ప్రజాప్రయోజనాల కోసమే ఒకేచోట అన్ని కార్యాలయాలు
● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
మంథని: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఒకేచోట సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంత్రి పలు అభివృద్ధి ప నులు ప్రారంభించారు. పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలోపాటు సుమారు 20 ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా రూ.4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. కమాన్‌పూర్, రామగిరి తహసీల్దార్ కార్యాలయాల భవనాలు ఒకేచోట ఉండేలా ప్లాన్ చేశామని ఆయన అన్నారు. రూ.30 లక్షలతో చేపట్టిన జెడ్పీ హైస్కూల్ రెనోవేషన్, రూ.35లక్షలతో చేపట్టిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రూ.80 లక్షల వ్యయంతో చేపట్టిన మోడల్ స్కూల్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు పాల్గొన్నారు.
అధికారులు జవాబుదారీగా ఉండాలి
కమాన్‌పూర్/రామగిరి(మంథని): వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక శాఖ గ్రంథాలయానిన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. రాజాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.