పెద్దపల్లిరూరల్: జిల్లాలో శుక్రవారం నుంచి మొదలు కానున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాల్లో 7,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 586 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
ఈ సారి 24 పేజీల బుక్‌లెట్ విధానం
ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను జవాబులు రాసేందుకు ఇవ్వనున్నారు. దీన్ని ఒకేసారి అందివ్వనుండడంతో పక్కవారికి పేపర్ అందించే అవకాశం ఉండదు. ఈ విషయమై టెన్త్ విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా మాస్ కాపియింగ్ జరగకుండా నిఘా బృందాలను నియమించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
వసతుల కల్పన
పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండకాలంలో దాహార్తిని తీర్చేందుకు నీరు, పరీక్ష సమయంలో దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించేలా ఆదేశాలిచ్చారు. పరీక్షల నిర్వహణపై సందేహాలుంటే కంట్రోల్ రూం నం. 97015 15725లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
జిల్లా సమాచారం
పరీక్షల నిర్వహణ: ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు
సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
పాఠశాలల సంఖ్య: 207 (135 ప్రభుత్వ, 72 ప్రైవేట్)
విద్యార్థుల సంఖ్య: 7,393 బాలికలు: 3,690, బాలురు: 3,703
ఇన్విజిలేటర్లు: 586 మంది
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు
సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం నం. 97015 15725
పకడ్బందీగా ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇతర శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించాం. కేంద్రాల వద్ద వైద్యసిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం.
– మాధవి, జిల్లా విద్యాధికారి
41 కేంద్రాలు.. 7,393 మంది విద్యార్థులు