
ప్రభుత్వ వైద్యుల ఘనత
● అభినందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి పండంటి కవలలకు పురుడు పోశారు. వీరి ప్రతిభ, అంకితభావం, తీసుకున్న చొరవ, నైపుణ్యాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో వరుసగా అరుదైన శస్త్ర చికిత్సలు కొనసాగుతున్నాయని, రెండు రోజుల క్రితం క్రిటికల్ కేర్ ఆపరేషన్ చేయగా, తాజాగా గురువారం రాత్రి మరో ట్విన్స్ డెలివరీ ఆపరేషన్‌ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. బొంపల్లి గ్రామానికి చెందిన అరికిళ్ల మేఘన నిండు గర్భిణి. ఎంసీహెచ్‌లో ఆరోగ్య పరీక్షలు పూర్తిచేసుకుని తొలికాన్పు కోసం బుధవారం ఎంసీహెచ్‌లో చేరింది. గర్భంలో కవలలు ఉండటంతో వైద్యులు పాపల ఊపిరితిత్తుల పరిణతి కోసం చికిత్స అందించారు. గురువారం సాయంత్రం మేఘనకు నొప్పులు రావడంతో అప్రమత్తమైన వైద్య బృందం డెలివరీ కోసం ఏర్పాట్లు చేశారు. అయితే, రక్తస్రావం ఎక్కువ జరిగే అవకాశం ఉండడంతో ప్ర త్యేక జాగ్రత్తలు తీసుకుని మేఘనకు సుఖప్రస వం చేయగా.. ఒక మగ, ఆడ శిశువులకు జన్మనిచ్చింది. చిన్నారులను పిల్లల వైద్యులు పరీక్షించి తల్లి ఒడిలోకి చేర్చారు. తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించిన వైద్యులు ప్రియాంక, కృష్ణవేణి, సంధ్య ను కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజలు హైరిస్క్ క్రిటికల్ సేవలను సద్వినియోగం చేసు కోవాలని శ్రీధర్ కోరారు. ప్రతీ గర్భిణికి 2–డీ ఇకోతో పాటు ప్రతీఆర్గాన్‌ని పరీక్షించే టిఫా స్కా న్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.