
కాలం చెల్లినా.. రయ్‌రయ్!
● ఫిట్నెస్ లేదు.. బీమా చేయరు ● రోడ్డుపై 15ఏళ్లు దాటిన వాహనాలు ● జిల్లాలో పెరుగుతున్న కాలుష్యం ● అనేక ప్రమాదాలకూ ఇవే కారణాలు
జిల్లాలో వాహనాల సమాచారం
ద్విచక్ర 84,739 సరుకు తరలించేవి 7,694 కార్లు 11,876 ఆటోలు 1,844 మోటర్ సైకిళ్లు 2,459 ఇతరత్రా 28,479 మొత్తం 1,37,091
15ఏళ్లు పైబడినవి
ద్విచక్ర 16,747 కార్లు 3,717 జీప్‌లు 32 మోటర్ సైకిళ్లు 15 ఇతరత్రా 1,869 మొత్తం 22,380
సాక్షి, పెద్దపల్లి: ‘కాలం చెల్లిన వాహనాలను వదిలించుకోండి.. రాయితీతో కొత్త వాహనాలు కొనుగోలు చేయండి’ అని ప్రభుత్వం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. అధికారుల తనిఖీలు లేక 15 ఏళ్లకు పైబడిన, కాలంచెల్లిన వాహనాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫిట్నెస్.. బీమా ఉంటేనే రోడ్డెక్కాలి..
లారీలు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు ఫిట్నెస్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణపత్రాలు ఉంటేనే రోడ్లపైకి రావాలి. చాలామంది ఇలాంటి ధ్రువీకరణపత్రాలు లేకపోయినా, కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారు. అధికశాతం ఇలాంటి వాహనాలతోనే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, తద్వారా నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటోందని పలువురు నిపుణులు చెబున్నారు. బీమా లేక, సాయం అందక బాధిత కుటుంబాలు కూడా వీధినపడుతున్నాయంటున్నారు.
ద్విచక్రవాహనాలే అధికం..
జిల్లాలో అన్నిరకాల వాహనాలు కలిపి 1,37,091 ఉండగా, అందులో 15ఏళ్ల పైబడిన వాహనాలు 22,380 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. ప్రధానంగా సెకండ్ హ్యాండ్ కార్లు, ద్విచక్ర వాహనాల ద్వారా అధికంగా కాలు ష్యం వెలువడుతోంది. కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో జిల్లావాసులు ఇబ్బంది పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కాలు ష్యాన్ని నియంత్రించడంతోపాటు భవిష్యత్ ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే..
వాహన తయారీ కంపెనీలు 15ఏళ్లపాటు మాత్రమే వినియోగించాలని ధ్రువీకరిస్తున్నాయి. ప్రతీ ఆర్నెల్లకోసారి కాలుష్యం తనిఖీ చేసి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఇవి ఎక్కడా అమలు కావడంలేదు. ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదని అధికారులు అంటున్నారు. అయితే పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇది తప్పనిసరి.
స్క్రాప్ పాలసీపై అవగహన లేక..
పాత వాహనాలను స్క్రాప్‌గా పరిణించేలా ప్రోత్సహించేందుకు ‘వలంటరీ వెహికలల్ ప్లీట్ మోడర్నైజేషన్ పాలసీ(వీవీఎంపీ)’ని 2024 అక్టోబర్ 8న ప్రకటించారు. దీనిద్వారా 15 ఏళ్లు పైబడిన నాన్ ట్రాన్స్‌పోర్ట్, 8 ఏళ్లు పైబడిన ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను స్క్రాప్‌గా చేయడం ద్వారా కాలుష్యన్ని తగ్గించడం, రోడ్డు భద్రతను మెరుగుపరచడం ఈ పాల సీ లక్ష్యం. 15 ఏళ్లు పూర్తికావడంతో పాటు ఫి ట్నెస్‌లేని వాటిని తుక్కుకు తరలిస్తే కొత్త వాహనం కొనుగోలు చేసే సమయంలో ట్యాక్స్‌లో రాయితీ పొందే అవకాశం ఉంది. పాలసీ ప్రకటించిన నుంచి రెండేళ్లలోపు స్క్రాప్ చేసే వాహనాలకు గ్రీన్‌ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్‌పై జరిమానా మాఫీ చేస్తారు. పాత వాహనాలను తుక్కుగా చేయకుండా వాహనదారు మరోవాహనం కొనుగోలు చేస్తే అదనంగా 2 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తుక్కుగా మార్చితే పన్నుభారం ఉండదు. కొత్త వాహనంపై రాయితీ పొందే అవకాశం ఉంటుంది.
వాహనాలు తుక్కుగా మార్చితే వర్తించే రాయితీ
ద్విచక్రవాహనం
ధర(రూ.లక్షల్లో) పన్నురాయితీ(రూ.లక్షల్లో)
1 లోపు 1,000
1–2 లోపు 2,000
2–3 లోపు 3,000
3–4 లోపు 4,000
4–5 లోపు 5,000
నాలుగు చక్రాలు
5 లోపు 10,000
5 –10 లోపు 20,000
10 –15 లోపు 30,000
15 – 20 లోపు 40,000
20కి పైగా 50,000
పొల్యూషన్ సర్టిఫికెట్ పొందాలి
వాహనదారులు బాధ్యతగా పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏళ్లుగా ఫిట్నెస్ పరీక్ష చేయించుకోకుండా, ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వారి వాహనాల్ని సీజ్ చేస్తున్నాం. ఫిట్నెస్‌తోపాటు ఇతర సర్టిఫికెట్లు లేకున్నా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు, డ్రైవర్లకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– రంగరావు, ఆర్టీవో

కాలం చెల్లినా.. రయ్‌రయ్!