న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలులోనే చంపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. జూన్ 3–జూలై 7వ తేదీల మధ్య కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు 26 రెట్లు పడిపోయినట్లు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాలు కేజ్రీవాల్ జీవితంతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు ఏ క్షణమైనా ప్రమాదం జరగొచ్చని అధికారిక నివేదికలే చెబుతున్నాయన్నారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై బీజేపీ, ఎల్జీ పదే పదే వెలువరిస్తున్న తప్పుడు నివేదికలు, చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయన్నారు.
‘కేజ్రీవాల్ పూరీలు, స్వీట్లు తదితరాలను అతిగా తింటున్నారని, అవసరం లేకున్నా ఇన్సులిన్ అడుగుతున్నారని వీరే గతంలో ఆరోపించారు. కోర్టు జోక్యంతో ఎయిమ్స్ వైద్యులు పరీక్షలు జరిపి ఆయనకు ఇన్సులిన్ ఇచ్చారు. ఇప్పుడేమో కేజ్రీవాల్ వైద్యులు సూచించిన మోతాదు కంటే తక్కువగా తింటున్నారని, అందుకే షుగర్ లెవెల్స్ పడిపోయాయని అంటున్నారు’అని సంజయ్ సింగ్ వివరించారు. దీని వెనుక కేజ్రీవాల్ ప్రాణాలు తీసేలా భారీ కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment