
ఛండీఘర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీకి సైతం పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. మోడీ పర్యటన సందర్బంగా ప్రధానిని పంజాబ్ ప్రజలు ప్లై ఓవరపై అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాలు ప్రధానిని అడ్డుకోవడంతో బీజేపీ తలపెట్టిన బహిరంగ సభకు మోడీ హాజరు కాకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. బీజేపీ నేతలు పంజాబ్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. దేశ ప్రధానికి కూడా భద్రత కల్పించలేని కాంగ్రెస్ ప‍్రభుత్వం ప్రజలకు భద్రత కల్పిస్తుందా అని ప్రశ్నించారు. ఇక, ఈసారి ఎన్నికల్లో అధికారమే లక్క్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ఎలక్షన్ బరిలో నిలిచాయి.
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లూథియానాలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని భద్రత అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని భద్రతపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి డర్టీ పాలిటిక్స్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని భద్రత, జాతీయ సెక్యూరిటీ అంశాలపై తాము అనవసర రాజకీయాలు చేయబోమని కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతీ పంజాబీ పౌరుడికి భద్రత కల్పిస్తామన్నారు.
ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్ఱ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. పంజాబ్ దేశ సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఇక్కడ డ్రగ్స్, డ్రోన్‌ల వంటి అంశాలపై తగు చర్యలు తీసుకునేందుకు నిజాయితీ కలిగిన ప్రభుత్వం అసరమంటూ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, పంజాబ్ లో ఫిబ్రవరి 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment