
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా బీజేపీ జాయినింగ్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేంద్ర.. మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో మంగళవారం సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తిచేసినట్లు సమాచారం.
ఒకవైపు సినీరంగ ప్రముఖులు, మరోవైపు మేధావి వర్గంపైనా బీజేపీ గురిపెట్టింది. ఈ నెల 21న అమిత్ షా సమక్షంలో పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల చేరికకు బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అటు ప్రజాసంఘాల మద్దతును కూడా కోరుతున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో భారీగా పార్టీలో చేరికలకు ఈటల రాజేంద్ర ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, జయసుధ గతంలో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జయసుధ కొంత పట్టుండటంతో ఆమెను పార్టీలోకి తీసుకొనేందుకు బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని ఈటల రాజేంద్ర.. జయసుధను కోరినట్లు సమాచారం.
చదవండి: ('అందుకోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించింది')