సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తన ఆస్తుల లెక్క తేల్చుకునే పనిలో పడింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఉన్న ఆస్తుల వివరాల ను సేకరించడంపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలోనూ ఉన్న ఆస్తుల లెక్క తేల్చేందుకు టీపీసీసీ సిద్ధమవుతోంది. గాందీభవన్ నుంచి మండల స్థాయిలో లేదా రెవెన్యూ డివిజన్ లేదా జిల్లా స్థాయిలో పార్టీకి కార్యాలయాలున్నాయా? ఆ కార్యాలయాలు ఎవరి పేరిట ఉన్నాయి? ఆ కార్యాలయాల ద్వారా వస్తున్న ఆదాయం సక్రమంగా వినియోగం అవుతుందా? లేదా? అనే వివరాలను సేకరించనున్నారు.
ఎక్కడెక్కడ... ఎవరి చేతుల్లో?
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కి హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో, పలు రెవెన్యూ డివిజన్లలో కూడా పార్టీ కార్యాలయాలు సొంతంగా ఉన్నాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయమైన గాం«దీభవన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్మించినప్పటికీ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హాయాంలో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి యాజమాన్య హక్కులు ఆ ట్రస్టుకు దఖలు పరిచారు. గాంధీభవన్‌ను వినియోగించుకున్నందుకు గాను ఈ ట్రస్టుకు నెలకు నామమాత్రపు అద్దెను కూడా పార్టీ చెల్లిస్తోంది.
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో ఉన్న కార్యాలయాలు పలువురు వ్యక్తులు, ట్రస్టుల పేరిట ఉన్నాయి. ఖమ్మం, కరీంనగర్ పార్టీ కార్యాలయాల విషయంలో ఏ ఇబ్బంది లేనప్పటికీ వరంగల్ జిల్లా లోని పార్టీ కార్యాలయాన్ని ఇతర వ్యక్తులు ట్రస్టీల రూపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదాయం వారే తీసుకుంటున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నా యి. భద్రాచలంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తి కంప్యూటర్ సెంటర్ పెట్టి సొంతానికి వినియోగించుకుంటున్నారని తెలుస్తోంది.
దిగ్విజయ్ నేతృత్వంలో...
సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తుల వివరాల సేకరణ కోసం కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలోని పార్టీ ఆస్తుల వివరాలను సేకరించేందుకు గాను ఏఐసీసీ నుంచి కుంభల్కర్‌ను ఇన్‌చార్జిగా నియమించగా, త్వరలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కమిటీని ప్రకటించనున్నారు. కమిటీ ప్రకటన అనంతరం జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ జిల్లాలో ఏయే ఆస్తులు న్నా యి? ఆయా ఆస్తుల ద్వారా ఏమైనా ఆదాయం వస్తోందా? వస్తున్న ఆదాయం రాష్ట్ర పార్టీ కి, జాతీయ పార్టీ కి అందుతోందా? ఒకవేళ అందకపోతే కారణాలేంటి? ఆస్తుల రక్షణ విషయంలో ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
‘కోఠి’ఆఫీసు పరిహారం ఎవరికెళ్లిందో?
హైదరాబాద్ నగర కమిటీకి కోఠిలో ఓ కార్యాలయం ఉండేది. మెట్రో రైల్ నిర్మాణంలో భాగంగా ఆ కార్యాలయం కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం ఎవరు తీసుకున్నారన్న దానిపై కూడా ఆరోపణలున్నాయి. గాందీభవన్ స్థానంలో పక్కనే ఉన్న భీంరావ్‌వాడలో ఇందిరాభవన్‌ను నిర్మించాలని మహానేత డాక్టర్ వైఎస్సార్ సీఎంగా ఉన్న ప్పుడు స్థలం కేటాయించారు.
ఇందుకు గానూ హౌసింగ్‌బోర్డుకు రుసుము చెల్లించారు. కానీ, ఆ తర్వాత అక్కడ భవనాన్ని నిర్మించే పరిస్థితి లేకపోవడంతో ఆ స్థలం కూడా పెండింగ్‌లో పడిపోయింది. ఆస్తుల లెక్కలు తేల్చడం ద్వారా ట్రస్టీల అధికారాలను పార్టీ తీసుకోవడంతో పాటు ఆస్తుల విషయంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వివరాలు సేకరిస్తున్నట్టు గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment