టీడీపీలో టికెట్ల కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
డబ్బున్నవారికే ప్రాధాన్యం ఇచ్చారని నేతల మండిపాటు
కార్యకర్తల అభిప్రాయమే శిరోధార్యమంటున్న దేవినేని స్మిత
మైలవరంలో వసంతను ఓడిస్తామంటున్న పార్టీ శ్రేణులు
కాకినాడలో ‘సానా’కు చుక్కెదురు
ఏలూరు ఎంపీ టికెట్ గారపాటికి కేటాయించాలని డిమాండ్
సాక్షి నెట్‌వర్క్: టీడీపీలో టికెట్ల లొల్లి చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడినవారు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని డబ్బు మూటలతో వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే జరిగితే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని పార్టీకి హెచ్చరికలు పంపుతున్నారు.
ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ జిల్లా నాయకులు కోరుతున్నారు.సంవత్సరాల తరబడి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గారపాటిని కాదని స్థానికేతరుడైన పుట్టాను ఖరారు చేయడం అన్యాయమని ఆ పార్టీ నేతలు ఏలూరు జిల్లా భీమడోలులో వాపోయారు. మరోవైపు ఇదే పార్లమెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు.
సింగపూర్‌లో ఉన్నతస్థితిలో ఉన్న తనను ఏలూరు టికెట్ ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారని నిలదీశారు. తనతో కోట్లు ఖర్చు చేయించారని, చివరికి మొండిచేయి చూపారని వీడియో విడుదల చేశారు.ఆదివారం కామవరపుకోటలో ఏర్పాటు చేయబోయే ఆత్మీయ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు.
శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి మంటలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి మామిడి గోవిందరావుపై దుమ్మెత్తిపోశారు. అవసరమైతనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సానా సతీష్ కు చుక్కెదురైంది. జనసేన నుంచి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఈ సీటు ఖరారు చేయడంతో టిక్కెట్టు ఆశించిన సతీష్ వర్గీయులు మండిపడుతున్నారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పైలా ప్రసాదరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంపై మాడుగుల మండలం కె.జె.పురంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గవిరెడ్డి అనుచరులు దేవరాపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
టీడీపీ ప్రతిసారీ మోసం: దేవినేని స్మిత
టీడీపీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత ఆరోపించారు. పెనమలూరు టికెట్ తమకెందుకు ఇవ్వలేదని, తమ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అధిష్టానాన్ని ఆమె నిలదీశారు. ఆడవాళ్లమైనా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేస్తే లాబీయింగ్ చేసుకున్న బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ముందు బోడెకు ఇవ్వబోమని ప్రకటించిన చంద్రబాబు తర్వాత ఎందుకు మొత్తబడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గారో ఆయన చెప్పాలని నిలదీశారు.
తమకు టికెట్ కేటాయిస్తేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలను, నమ్మి పదవి కట్టబెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, పార్టీ మారి టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పులిపాక ప్రకాష్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తాను వసంతను ఓడించడానికే పని చేస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment