కెప్టెన్ అమరీందర్ సింగ్ జీవనయానం
ఆయన ఒక సైనికుడు.. దేశ రక్షణ కోసం పాకిస్తాన్‌పైనే యుద్ధం చేశారు. ఆపరేషన్ బ్లూ స్టార్‌కు, సిక్కుల ఊచకోతకు వ్యతిరేకంగా పోరాడారు. కాంగ్రెస్‌లోని అసమ్మతి వాదులతో యుద్ధం చేశారు. జీవితంలో అడుగడుగునా ఎదురైన సవాళ్లకు ఎదురొడ్డి నిలిచారు తప్పితే.. ఏనాడూ వెన్ను చూపలేదు. ఈ పాటియాలా రాజవంశ వారసుడు..పంజాబీల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఎక్కడికి వెళ్లినా కెప్టెన్ అంటూ జన నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడు జీవితచరమాంకంలో తనను అవమానించిన కాంగ్రెస్‌పై కత్తి దూస్తున్నారు. కసితో రగిలిపోతున్నారు. అందుకే బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల సమరంలో సై అంటున్నారు.
- యాదవేంద్ర సింగ్, మహరాణి మహీందర్ కౌర్ దంపతులకు పంజాబ్‌లోని పాటియాలాలో 1942 మార్చి 11న జన్మించారు.
- డెహ్రాడూన్‌లో డూన్ స్కూలులో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.
- పుణేలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి డిగ్రీ చేశారు
- చిన్నప్పట్నుంచి ఆర్మీ కెప్టెన్ అవాలని ఆశపడ్డారు. 1963లో ఇండియన్ ఆర్మీలో చేరారు
- 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీలో కెప్టెన్‌గా ఉన్నారు.
- 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ 2009–2014 మధ్య విదేశాంగ శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
- సిక్కుల చరిత్ర మీద, యుద్ధాల మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ది లాస్ట్ సన్‌సెట్, ది మాన్‌సూన్ వార్ అన్న పుస్తకాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.
- 1984లో ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బ్లూ స్టార్‌ను నిరసిస్తూ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
- అదే సంవత్సరం కాంగ్రెస్‌కి గుడ్‌బై కొట్టేసి శిరోమణి అకాలీదళ్‌లో (ఎస్‌ఏడీ) చేరి ఎమ్మెల్యే అయ్యారు.
- 1992లో అకాలీదళ్‌ను వీడి సొంతంగా శిరోమణి అకాలీదళ్ (పాంథిక్) అనే పార్టీని స్థాపించారు
- 1998లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలోనే అమరీందర్‌కు 856 ఓట్లు మాత్రమే వచ్చాయి
- పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా పలుమార్లు బాధ్యతలు నిర్వహించారు
- 2002లో తొలిసారిగా పంజాబ్ సీఎం అయ్యారు.
- 2017లో మార్చి 16న మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు.
నవజోత్ సింగ్ సిద్దూతో విభేదాల కారణంగా అమరీందర్ నాయకత్వ సామర్థ్యంపైనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో 2021, సెప్టెంబర్ 18న పంజాబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీకి 2021, నవంబర్ 2న గుడ్‌బై కొట్టారు. ఏడు పేజీల రాజీనామా లేఖని అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) పేరుతో 2021, డిసెంబర్ 17న కొత్త పార్టీ స్థాపించి బీజేపీతో జతకట్టి ఎన్నికల్లో పాల్గొంటామని ప్రకటించారు. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న అమరీందర్‌కు ఈ ఎన్నికలు పూల పాన్పు కాదు. ప్రజలకి ఈ మధ్యకాలంలో బాగా దూరమయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెడ్డ పేరు సంపాదించారు.
ఇన్నాళ్లూ వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఆయన అనుచరులకి మింగుడు పడడం లేదు. కాంగ్రెస్ నుంచి ఆశించినంత సంఖ్యలో ఆయన వెంట ఎమ్మెల్యేలు రాలేదు. అమరీందర్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో చరిత్రను పునరావృతం చేస్తూ ఎన్నికలయ్యాక ఆయన పార్టీని బీజేపీలో కలిపేస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పంజాబ్‌లో రైతులు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉండడంతో దాని ప్రభావం, బీజేపీ, అమరీందర్ పార్టీ పీఎల్‌సీ, అకాలీదళ్‌లో చీలికవర్గమైన శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) కూటమిపై పడుతుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.
రాజీవ్ ప్రేరణతో..
అమరీందర్ సింగ్ డూన్ స్కూలులో చదువుతున్నప్పుడు రాజీవ్‌గాంధీ ఆయనకు మంచి మిత్రుడు. ఆర్మీ నుంచి పదవీ విరమణ చేశాక రాజీవ్ కోరిక మేరకే కాంగ్రెస్‌లో చేరి పాటియాలా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి పాటియాలా మహరాజుగా ప్రజలందరూ ఆయనను కీర్తించారు. కాంగ్రెస్ పార్టీలో అమరీందర్‌పై సిద్ధూ చేసిన అసమ్మతి యుద్ధంతో అవమానకర రీతిలో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఈసారి ఎంత మేరకు ప్రభావం చూపించగలరన్న అనుమానాలైతే ఉన్నాయి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం వేరు కుంపటి పెట్టి చేతులు కాల్చుకున్న అమరీందర్ అప్పట్లో పార్టీ జెండా పీకేసి కాంగ్రెస్‌లో కలిపేశారు. ఈసారి ఎన్నికలయ్యాక పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారమైతే సాగుతోంది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment