కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షల మేరకు ‘బంగారు బెంగాల్’ను అందివ్వడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం కాదు అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర చివరి దశ ర్యాలీని గురువారం దక్షిణ 24 పరగణ జిల్లా కాక్‌ద్వీప్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీని అధికారం నుంచి దూరం చేయడం తమ ఉద్దేశం కాదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మమతా బెనర్జీని అధికారం నుంచి పడగొట్టి.. పదవి చేపట్టడం బీజేపీ ధ్యేయం కాదు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని పేదలు, మహిళల జీవన స్థితి గతులను మార్చడం.. వారిని అభివృద్ధి పథంలోకి నడపడమే మా ధ్యేయం. ఇవి బీజేపీ కార్యకర్తలు, టీఎంసీ సిండికేట్ నాయకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. వీటిల్లో మేం గెలిస్తే ప్రజలు కోరుకుంటున్న బంగారు బెంగాల్‌ను వారికి అందిస్తాం’’ అన్నారు అమిత్ షా.
‘‘ప్రజల ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రిజర్వేషన్లను 33 శాతం కంటే అధికంగానే అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రయోజనాలు అందేలా చూస్తాం. అమ్ఫాన్ రిలీఫ్ ఫండ్ల పంపిణీలో అవినీతిపై దర్యాప్తు చేస్తాం’’ అని అమిత్ షా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment