
ఇకపై నెలకు 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ మార్గ నిర్దేశం చేశారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
సాక్షి, అమరావతి: ఈసారి కుప్పంతో సహా 175 శాసనసభా స్థానాల్లోనూ గెలుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇకపై నెలకు 20 రోజులు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణ తీరు సరికాదు
కృష్ణా, గోదావరి జలాల వివాదాలపై ఆయా బోర్డులు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. కృష్ణా బోర్డు సమావేశాలకు రెండుసార్లు గైర్హాజరై ఎక్కువ నీటి కేటాయింపులు కావాలని తెలంగాణ అడగడం సమంజసం కాదన్నారు. పోలవరం ఒక్కో స్టేజీలో ఒక్కో విధంగా నీటి నిల్వలు ఉంటాయన్నారు. ప్రాజెక్టు దశలవారీగా పూర్తవుతుందన్నారు. పోలవరంలో తొలుత 41.71 టీఎంసీల వరకు నీటిని నింపి కాలువల ద్వారా పంపుతారని చెప్పారు. ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై కచ్చితమైన సమయం చెప్పలేమన్నారు.
రాజకీయ ప్రత్యర్థుల ఇంటికీ వెళ్లమన్నారు: పేర్ని
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీలకు అతీతంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇతర పార్టీల్లో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లకు సైతం వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయాలని సూచించారన్నారు. వర్క్‌షాపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయ విమర్శలు చేసినా నవ్వుతూ ముందుకు సాగాలని సీఎం సూచించారన్నారు. అర్హులందరికీ పథకాలు అందించాలని, ఏవైనా సాంకేతిక లోపాలుంటే సరిదిద్దాలని నిర్దేశించారన్నారు. టీడీపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో తానే మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని నూతన వస్త్రాలు కుట్టించుకున్న చంద్రబాబు ప్రజాభీష్టాన్ని గుర్తించక ఓటమి చవి చూశారన్నారు.
ఇన్ని సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?: మంత్రి రోజా
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన సందర్భంగా అవగాహన లేకుండా మాట్లాడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. మూడేళ్లలోనే 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఏపీ తరహాలో సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడుందని ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.
వేగంగా వినతుల పరిష్కారం: ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్
ప్రతి ఇంటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వివరించాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు తెలిపారు. ప్రజల నుంచి అందే వినతులను నమోదు చేసి వేగంగా పరిష్కరించాలని సీఎం నిర్దేశించారన్నారు. ఇకపై మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారన్నారు.
అన్ని స్థానాల్లో విజయదుందుభి: జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలూ గెలవాలని సీఎం జగన్ నిర్దేశించారని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించి పరిష్కరించాలని సూచించారన్నారు. గడప గడపకు కార్యక్రమంలో నేతలు ఎలా పాల్గొంటున్నారనే అంశంపై నియోజకవర్గాల వారీగా నివేదికలు సిద్ధం కానున్నాయన్నారు.
విజ్ఞప్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే సుధ
గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల నుంచి అందే వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధ తెలిపారు. నెలకు 20 రోజుల చొప్పున పది సచివాలయాల్లో కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మరింత సమర్థంగా నిర్వహించడంపై నిరంతరం చర్చించాలని సీఎం సూచించారన్నారు.
నో వన్ లెఫ్ట్ బిహైండ్ నినాదంతో: గుడివాడ అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి ప్రజా స్పందనను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. మరింత మెరుగ్గా నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. ‘నో వన్ లెఫ్ట్ బిహైండ్’ అనే నినాదంతో 175 స్థానాలను సాధించాలని సీఎం నిర్దేశించారన్నారు.