గుంటూరు, సాక్షి: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘాల తీరుపై వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఏపీ సీఈవో, సీఈసీ ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్‌పై వాదనలు శుక్రవారం పూర్తి కాగా, జడ్జి తీర్పును రేపటికి(జూన్ 1 శనివారం) రిజర్వ్ చేశారు. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ.. పోస్టల్ బ్యాలెట్ ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను గురువారం ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది. శుక్రవారం ఇరువైపులా వాదనలు జరిగాయి. వాదనలు ముగియడంతో శనివారం సాయంత్రం తీర్పు వెల్లడిస్తామని ఏపీ హైకోర్టు ఇరువర్గాలకు తెలిపింది.
వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు..
ఏపీలో 5.39 లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నాయి
పోస్టల్ బ్యాలెట్‌పై సంతకం చేసి.. స్టాంప వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుంది
కానీ, పోస్టల్ బ్యాలెట్‌పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని.. ఈసీఐ సర్క్యులర్ జారీ చేయడం సరికాదు
రూల్ 27 ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టింగ్ అధికారి పేరు, సంతకం ఉండాలి
సదరు పోస్టల్ ఓటర్ తనకు తెలుసు అని, అటెస్టెడ్ అధికారి సర్టిఫై చేయాలి
రూల్ 54ఏ ప్రకారం.. డిక్లరేషన్‌పై సంతకం, స్టాంప్ లేకుంటే అధికారి ఆ పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాలి
ఈసీఐ ఇచ్చిన సర్క్యులర్ నిబంధనలను తుంగలో తొక్కింది
దీనిపై పోస్టల్ ఓట్లు చెల్లుబాటుపై సందేహాలు లేవనెత్తుతోంది
ఇన్ని లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నప్పుడు కేవలం సంతకం ఉంటే.. ఆ సంతకం సరైనదా? కాదా? అని ఎవరు నిర్ధారిస్తారు?
అన్ని రాష్ట్రాల్లో నిబంధనలకు అనుకూలంగా లేకుంటే.. పోస్టల్ ఓట్లు చెల్లుబాటు కావు. కానీ, ఏపీలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి!
అటెస్టేషన్ లేకుండా వచ్చిన పోస్టల్ ఓట్లను సైతం లెక్కపెట్టాలని ఈసీఐ అకస్మాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకుంది?
రాత్రికి రాత్రి సర్క్యులర్ తీసుకొచ్చి.. అటెస్టెడ్ అధికారి పేరు, అడ్రస్, హోదా అవసరం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది
ఏపీ సీఈవోను వెనుకేసుకొచ్చిన ఈసీ
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ స్పందించింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. తద్వారా ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించినట్లయ్యింది. అయితే దేశం మొత్తం ఒకలా ఉంటే.. ఏపీ వరకు రూల్స్ మార్చేందుకు ఈసీ అనుమతులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర ఎన్నికల సంఘం డబుల్ గేమ్
ఫాం 13ఏపై అటెస్టేషన్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు.
:::ఏపీ సీఈవోతో కేంద్ర ఎన్నికల సంఘం
‘‘పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’
:::పోస్టల్ బ్యాలెట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం వివరణ
ఒకవైపు ఏపీ సీఈవో తీసుకున్న నిర్ణయం సరైందేనని చెబుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఆయన రూల్స్ పక్కన పెట్టారన్న సంగతిని మాత్రం పక్కనపెడుతోంది. అలాగే.. మెమోలో కొంత భాగం మాత్రమే వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించి డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment