Yogi Adityanath: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛరిష్మాతో ఉత్తరప్రదేశ్‌లో రెండు పర్యాయాలు లోక్‌సభ, ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలొచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. యూపీలో ప్రధాని మోదీ తర్వాత అంతటి జనాదరణ కలిగిన నాయకుడిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎదిగారు. ఈసారి ఎన్నికలు యోగి కేంద్రంగానే జరగబోతున్నాయి. గత అయిదేళ్లలో బీజేపీకి ఆయనే బలం, ఆయనే బలహీనత అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య హోరాహోరీగా నెలకొన్న యూపీ రణక్షేత్రంలో కమలనాథులకి కలిసొచ్చే అంశాలు, సవాల్ విసిరే అంశాలేమిటో చూద్దాం.
– నేషనల్ డెస్క్, సాక్షి
కలిసొచ్చే అంశాలు
1. యోగి ఇమేజ్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛరిష్మాతోనే బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిన నాలుగు నెలల్లోనే యూపీలో బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో 403 స్థానాలకు గాను 312 సీట్లలో విజయం సాధించింది. ఈసారి మోదీ ఛరిష్మాతో పాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కున్న క్రేజ్ పార్టీకి కలిసొస్తోంది. గత ముఖ్యమంత్రులు నిర్లక్ష్యం చేసిన నోయిడా లాంటి ప్రాంతాన్ని ఒక ఆర్థిక హబ్‌గా యోగి తీర్చి దిద్దారు. అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు పెట్టించారు. అవినీతి మచ్చుకైనా లేని సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
చదవండి: చన్నీ, సిద్ధూలు పంజాబ్ ప్రజలను దోచుకున్నారు: అరవింద్ కేజ్రీవాల్
2.హిందుత్వ ఎజెండా: బీజేపీ రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా హిందుత్వ ఎజెండా చుట్టూ నడుస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం, ఘర్ వాపసీ (ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువుల్ని వెనక్కి తీసుకురావడం) ట్రిపుల్ తలాక్ రద్దు, హిందుత్వ రాజకీయాలను పటిష్టపరచడానికి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వంటివన్నీ యోగి ఆదిత్యనాథ్ హయాంలోనే జరిగాయి. వీటి ప్రభావం ఎంతగా ఉందంటే ఇతర పార్టీల నేతలు కూడా హిందుత్వ వైపు దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆలయాల సందర్శన, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దుర్గాపూజ రోజు వారణాసిలో పూజలు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య సందర్శన వంటివన్నీ ఎంతో కొంత హిందువుల్ని ఆకట్టుకునే వ్యూహంలో భాగమే.
చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే
3. శాంతి భద్రతలు: నేరాలు ఘోరాలతో అల్లాడిపోయే ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్రిమినల్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేరచరితులు తమ దారి మార్చుకోవాలని లేదంటే యూపీ విడిచి వెళ్లిపోవాలంటూ సీఎం పీఠమెక్కగానే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో గ్యాంగ్‌స్టర్ యాక్ట్ కింద అరెస్ట్‌లు, ఎన్‌కౌంటర్లు విపరీతంగా జరిగాయి. దీనిపై సీఎం ఏనాడూ ఆత్మరక్షణలో పడకుండా ఎదురుదాడికే దిగేవారు. ఎవరైనా నేరం చేస్తే కాల్చి చంపేస్తామంటూ పోలీసులకు అండగా ఉన్నారు. ఈ కఠిన చర్యలతో నేరాల రేటు యూపీలో బాగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడదే బీజేపీకి ఎన్నికల ప్రచారాంశంగా మారింది.
సవాల్ విసిరే అంశాలు
1.రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి: భారతీయ జనతా పార్టీలో ఎవరి స్థాయిలో వారికి నాయకులందరికీ తగినంత ప్రాధాన్యం దక్కుతుంది. ఎందరో ప్రభావం చూపించే నాయకులు ఎదిగేలా పార్టీ నిర్మాణం ఉంటుంది. కానీ యూపీ బీజేపీలో పరిస్థితులు మారిపోయాయి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్టీలోని తన గుప్పిట్లో పెట్టుకొని శాసిస్తున్న సీఎం యోగి వైఖరిపై చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు.. పార్టీలో తగినంత ప్రాధాన్యం తమకు దక్కలేదని వారు వాపోతున్నారు. తమ నియోజకవర్గంలో ఏ చిన్న పని చేపట్టాలన్నా సీఎం కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి రావడంతో రగిలిపోయే పరిస్థితులున్నాయి. అసంతృప్త నేతల్లోనూ, కార్యకర్తల్లోనూ ఎన్నికల మూడ్ తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది.
2.ఓట్లు సంఘటితం: మతం ఆధారంగా ఓట్లను సంఘటితం చేసే వ్యూహాన్ని చాలా కాలంగా బీజేపీ అనుసరిస్తూ వస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో‘‘ ఠాకూర్‌వాడా’’అనే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఠాకూర్లకు (రాజ్‌పుత్) మద్దతుగా వ్యవహరిస్తూ వారి ఓట్లను సంఘటితం చేసే చర్యలు తీసుకున్నారు. ఫలితంగా రాష్ట్రంలో మరో బలమైన సామాజిక వర్గం బ్రాహ్మణులు బీజేపీపై అగ్రహంతో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్ర కారం దాదాపుగా 10% ఉన్న బ్రాహ్మణుల్ని దూరం చేసుకొని ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. బ్రాహ్మణుల్ని బుజ్జగిం చడం కో సమే కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద వంటి నాయకుల్ని బీజేపీవైపు లా గారు. నలుగురు రైతుల ప్రాణాలు బలిగొన్న లఖీంపూర్ ఖేరి ఘ టనకి బాధ్యతవహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలన్న డిమాండ్లను బీజేపీ అగ్రనాయకత్వం పెడచెవిన పెట్టడానికి మిశ్రా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడమే కారణం.
3.చట్టాలపై నిరసనలు: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయం చట్టం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి అతి పెద్ద సవాల్‌గా నిలుస్తున్నాయి. పశ్చిమ యూపీ కేంద్రంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకాయి. రైతుల ఆగ్రహానికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం చట్టాలు వెనక్కి తీసుకున్నప్పటికీ రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత నెలకొంది. కోవిడ్–19 సంక్షోభానికి ముందు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్ని యోగి ఉక్కుపాదంతో అణిచివేసినప్పటికీ వాటి ప్రభావం బీజేపీపై గట్టిగానే పడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment