దేవ దేవుడు కొలువై ఉన్న తిరుపతిలో టీడీపీకి అంత సీన్ ఉందా? తిరుపతి టీడీపీ టిక్కెట్ కోసం అంతమంది ఎందుకు పోటీపడుతున్నారు. స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పచ్చ నేతలు ఎందుకు మారిపోయారు? అధికార పార్టీ ఎమ్మెల్యే అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే.. విపక్షంలోని నేతలు టిక్కెట్ ఫైట్లో మునిగిపోవడానికి కారణం ఏంటి?
టికెట్ కోసం తెలుగు తమ్ముళ్ల పాట్లు
తిరుపతి తెలుగుదేశం పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరం పెంచుకుంటూ.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుపున ఎట్టి పరిస్థితుల్లో అయినా టిక్కెట్ దక్కించుకోవాలని బీసీ సామాజిక వర్గానికి చెందిన తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ గట్టిగా పైరవీలు చేస్తున్నారు. యాదవ సామాజిక వర్గం కోటాలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె స్థానంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు కాకుండా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం ఊపందుకోవడంతో.. ఉమ్మడి జిల్లా బీసీ కోటాలో తిరుపతి నుంచి తనకు సీటు ఇవ్వాలనేది నరసింహ యాదవ్ డిమాండ్‌గా చెబుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నియోజకవర్గం ఇంఛార్జిగా తనపని తాను చేసుకుపోతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న సుగుణమ్మ టీడీపీ టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా తన పాత బలాన్ని, తన కుటుంబానికి ఉన్న బంధుత్వాలను తెరపైకి తీసుకువచ్చి టికెట్ తనకే ఇవ్వాలనే డిమాండ్‌తో పచ్చపార్టీ అధినాయకత్వం దృష్టిలో పడ్డారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన మరో యువనేత, ఆర్థికంగా బలంగా ఉన్న జే.బీ కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తిరుపతి నగరంలో యువతను ఆకట్టుకోవడంతోపాటు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జే.బీ తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
తిరుపతిలో మొదటి నుంచి సొంత బలం, బలగం ఉన్న కోడూరు బాల సుబ్రమణ్యం కూడా బలిజ సామాజిక వర్గం కోటా పేరుతో పావులు కదుపుతున్నారు. అటు చంద్రబాబు-ఇటు చినబాబు లోకేష్ ను ప్రసన్నం చేసుకోవాడానికి తిరుపతి తెలుగు తమ్మళ్లు రోజుకో వేషం వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నాయకత్వంపై అసమ్మతి పెరుగుతుండటంతో అనేక మంది టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అభివృద్ది పనులతో దూసుకుపోతున్న భూమన కరుణాకర్ రెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఎన్నడు లేనివిధంగా అభివృద్ది పనులు చేస్తూ దూసుకుపోతున్నారు. నగరంలో శ్రీనివాస సేతు ప్లైఓవర్ నిర్మాణంతోపాటు, 40 ఏళ్లుగా అమలుకు నోచుకోని తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లకు కూడా మోక్షం కల్పిస్తూ.. వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ది చేశారు. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. తిరుపతి గంగమ్మ ఆలయం పునర్ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు. అయితే విపక్షంలో అసమ్మతి గళం ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చే అంశంగా మారుతోంది.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment