కవితకు దీక్ష చేసే అర్హత లేదు | Bandi Sanjay Comments on Mlc Kavitha | Sakshi
Sakshi News home page

కవితకు దీక్ష చేసే అర్హత లేదు

Published Sat, Mar 11 2023 2:48 AM | Last Updated on Sat, Mar 11 2023 2:48 AM

Bandi Sanjay Comments on Mlc Kavitha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సీఎం కేసీఆర్‌ బిడ్డ కవితకు మహిళా బిల్లుపై ఢిల్లీలో దీక్ష చేసే అర్హత, మాట్లాడే నైతికహక్కు లేవు. రాష్ట్రంలో మహిళల సమస్యలు, వారిపై సాగుతున్న అఘాయిత్యాలు, అన్యాయంపై కవిత ఏనాడూ నోరు మెదపలేదు. రాష్ట్రంలో మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా, నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొదట కవిత తన తండ్రి ఇంటి ఎదుట ధర్నా చేసి మహిళలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించడం లేదేమని నిలదీస్తే బాగుండేది’’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘మహిళా గోస– బీజేపీ భరోసా’పేరిట పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పలువురు మహిళా నేతలు నిరసన దీక్ష నిర్వహించారు. బండి సంజయ్‌ ఈ దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి ఏమైనా సంబంధం ఉందా, దీనిపై ఎందుకు స్పందించడం లేదని సంజయ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తుంటే ప్రజాసమస్యలపై పోరాడుతున్న పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్, ఎంఐఎంల జెండాలను చూస్తేనే మహిళలు భయపడే పరిస్థితి నెలకొందని బండి సంజయ్‌ విమర్శించారు. గతంలో మహిళా బిల్లు ప్రతులను పార్లమెంటులోనే చించి పడేసిన ఎస్పీ, ఆర్జేడీ, ఎంఐఎంలతో బీఆర్‌ఎస్‌ అంటకాగుతూ దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

మరి ఈ కేసులు బీఆర్‌ఎస్‌ పెట్టించినవా?: కె.లక్ష్మణ్‌ 
సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని కేటీఆర్‌ అంటున్నారని.. మరి రాష్ట్ర పోలీస్, ఏసీబీ పెట్టిన కేసులన్నీ బీఆర్‌ఎస్‌ పెట్టించినవేనా? అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెలంగాణలో మద్యం ఆదాయ మార్గంగా మారి ఢిల్లీ నుంచి పంజాబ్‌ దాకా పాకిందని విమర్శించారు. 

లిక్కర్‌ స్కామ్‌పై కాంగ్రెస్‌ మాట్లాడదేం?: డీకే అరుణ 
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై కాంగ్రెస్‌ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్కటేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఈడీ కేసులకు, కవిత ధర్నాకు ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అవమానిస్తుంటే.. మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

ఈ దీక్షలో పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఆకుల విజయ, డాక్టర్‌ పద్మ, మాజీ మేయర్‌ కార్తీకరెడ్డి, సులోచన, గీతారాణి తదితరులు పాల్గొన్నారు. కాగా మహిళా దీక్ష సందర్భంగా బండి సంజయ్, డీకే అరుణలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేసి అభినందించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ దీక్ష చేయడం అభినందనీయమన్నారు. 

కేసీఆర్‌ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘‘సీఎం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నేతల సమావేశం సంతాప సభను తలపించింది. ఆయన ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ ఫ్యామిలీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ కుటుంబంలో ఒక వికెట్‌ క్లీన్‌బౌల్డ్‌ అయింది. తప్పు చేసినోళ్ల సంగతి తేలుస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు.

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండేది మరో మూడు, నాలుగు నెలలేనని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని పేర్కొన్నారు. టీఎన్జీవో నాయకుల చిట్టా తీస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement