పాదయాత్రలో కొత్తపేటలో చిన్నారులతో మాట్లాడుతున్న బండి సంజయ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘మేము బీజేపీ సర్పంచ్‌ను ఎన్నుకున్నామని స్థానిక ఎమ్మెల్యే సహా సీఎం కేసీఆర్ మాపై కక్షగట్టారు. పెన్షన్లు, డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వట్లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయట్లేదు’అని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామస్తులు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర బుధవారం షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట, కొత్తపేట, సంతాపూర్, కోనాయపల్లి గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా సంతాపూర్‌లో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఆయన పాల్గొన్నారు. సర్పంచ్ అంజయ్య సహా గ్రామస్తులు తమ సమస్యలను సంజయ్‌కు విన్నవించారు.
తమ ఊరికి రోడ్లు, డ్రైనేజీ పనులకు నిధులివ్వట్లేదని.. అర్హులకు పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వట్లేదని, ఊర్లో సీసీ రోడ్లు వేయనీయట్లేదని, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. స్పందించిన సంజయ్.. అంగన్‌వాడీ కేంద్రం కోసం తన ఎంపీ లాండ్స్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ‘సార్.. మా ఊర్లో నెల రోజుల నుంచి తాగేందుకు మంచినీరు రావట్లేదు’అని కొత్తపేటకు చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా.. ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వడం చేతకాని కేసీఆర్.. ఊరూరా బెల్ట్‌షాపును తెరిచి ప్రతి ఒక్కరితో మందు తాగిస్తున్నారని విమర్శించారు.
ఎక్కడ చూసినా గుంతల రోడ్లు
దళితులకు మూడెకరాలు ఇస్తామని ఇవ్వకుండా 70 ఏళ్ల క్రితం పేదలకు పంచిన ప్రభుత్వ భూములను కేసీఆర్ గుంజుకుంటున్నారని సంజయ్ మండి పడ్డారు. తాను పాదయాత్ర చేస్తుంటే ఎక్కుడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయని, తలెత్తి ప్రజలకు అభివాదం చేయలేని పరిస్థితి ఉందని, ఏ గుంతలో పడతామో తెలియని దుస్థితి నెలకొందని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌పై కేసీఆర్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తున్నారని, నీళ్లిస్తే వాళ్ల రియల్ ఎస్టేట్ దందా నడవదనే ప్రాజెక్టు పనులు ప్రారంభించట్లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment