ప్రజాసంగ్రామ యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్
అలంపూర్/సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చెయ్. తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు.. మేం చేసిన తప్పేంది? పాపమేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోరాటడమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం బస చేసే శిబిరాలను ధ్వంసం చేస్తారా..?’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేద న్నారు. బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. పేదల ప్రభుత్వం రావాలంటే గడీల పాలన పోవాల్సిందే అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలంలో సోమవారం ఐదవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. ఇటి క్యాల మండలంలోని 44వ జాతీయ రహదారి వేముల స్టేజీ నుంచి వేముల, షాబాద, ఉదండాపురం గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా వేముల, షాబాద గ్రామాల్లో బండి మాట్లాడారు.
పాలమూరు గోస చూస్తుంటే బాధేస్తోంది
‘మేం ప్రజా సమస్యలు తెలుసుకుందామని పాదయాత్రగా వస్తే.. కొంతమంది టీఆర్‌ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసి, రక్తం కారేలా కొట్టారు. శ్రీకాంతాచారి, సుమన్, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరులు ఇందుకోసమేనా ప్రాణత్యాగం చేసింది? పాలమూరు ప్రజల గోస, ఇక్కడి కరువు పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోంది. ఎక్కడికి వెళ్లినా నీళ్ల సమస్యనే ప్రధానంగా చెబుతున్నారు.
200 కి.మీ. దూరంలో ఉన్న కాళేశ్వరం ద్వారా సీఎం ఫాంహౌస్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టిండు. కానీ ఆర్డీఎస్ ద్వారా అలంపూర్‌కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ద్వారా సాగు నీరు అందిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లను బొక్కలో వేస్తాం..’అని బండి అన్నారు. పాదయాత్రలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాడిని ఖండించిన బీజేపీ నేతలు...
సంజయ్ పాదయాత్రపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, పార్టీ నేతలు ఈటల, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్.కుమార్, కొల్లిమాధవి, డా.జి.విజయరామారావు, టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. సంజయ్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి టీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బాహాబాహీ .. రాళ్లదాడి
ప్రజాసంగ్రామ యాత్రలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేముల గ్రామాన్ని దాటుతున్న సమయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు కొందరు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. పోలీసుల జోక్యంతో పాదయాత్ర కొనసాగింది. కాసేపటికే మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తర్వాత షాబాద వైపు నుంచి వాహనంలో వచ్చిన కొందరు టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ నాయకులతో వాదనకు దిగారు.
వాదన ముదరడంతో బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు సైతం రువ్వుకున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురికి, బీజేపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తర్వాత ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం తర్వాత యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment