శనివారం మాసబ్‌ట్యాంక్ వద్ద పాదయాత్రగా వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయమని, తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్న మార్పు తథ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవినీతి పాలనను కూకటివేళ్లతో పెకిలించేందుకే ఈ యాత్ర చేపడుతున్నామన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేయాలనే లక్ష్యంతో అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నామని పాదయాత్ర ప్రారం భిస్తున్నామన్నారు. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు సమరశంఖం పూరిస్తున్నామన్నారు. ఉచితంగా యూరియా ఇవ్వ లేని దుర్మార్గపు సీఎం, రైతు రుణమాఫీ చేయలేని దగా ముఖ్యమంత్రి, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వలేని.. కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అమరుల ఆశయ సాధన కోసం.. దళిత, బడుగు, బలహీన వర్గాల కోసం.. ఈ యాత్ర సాగుతోందన్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ ప్రజాస్వామిక తెలంగాణను, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిజమైన హిందువైతే భాగ్యలక్ష్మి అమ్మవారున్న చోటు నుంచే వినాయక నిమజ్జన శోభాయాత్రను, హనుమాన్ జయంతి యాత్రను నిర్వహించే దమ్ముందా అని సంజయ్ సవాల్ విసిరారు. పాతబస్తీ ఎవరి అడ్డా కాదు.. ఈ రాష్ట్రం మాది.. ఏ గల్లీకైనా వస్తామని పేర్కొన్నారు. తాలిబన్ భావజాలమున్న పార్టీని, ఆ పార్టీకి సహకరిస్తున్న వారిని రాష్ట్రం నుంచి తరిమేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
లక్ష ఇళ్లు కూడా కట్టలేదు...
రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కడతామని.. లక్ష కూడా కట్టలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ధ్వజమెత్తారు. ఆలీబాబా 40దొంగల మాది రిగా రాష్ట్రంలో కుటుంబ, దోపిడీ పాలన సాగుతోందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్ పేర్కొన్నారు. ఈ పాదయాత్రతో కేసీఆర్ గుండెల్లో గుబులు మొదలైందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ చెప్పారు.
ప్రజా సం గ్రామ యాత్రను అరుణ్ సింగ్, తరుణ్‌ఛుగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎంపీలు అరవింద్, సోయం బాబూరావు, మునుస్వామి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ నేతలు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, నల్లు ఇంద్రసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, మనోహర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్.కుమార్, మంత్రి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపింది. ప్రారంభ కార్యక్రమం, బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా, యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభ చిత్రాలను, వీడియోలను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం పోలీసులు,కార్యకర్తల మధ్య వాగ్వాదానికి దారితీసింది. సంజయ్ విజ్ఞప్తి మేరకు ఇరు వర్గాలు శాంతించాయి.
కేసీఆర్ పీఠాలు కదలడం ఖాయం
టీఆర్‌ఎస్ సర్కార్‌ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల ఆధిపత్య, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి.. బీజేపీ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పాలనను తెచ్చుకోవాల్సి ఉందన్నారు. సంజయ్ యాత్రకు ఊరూవాడా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది కేసీఆర్‌ను గద్దె దించే ఉద్యమమన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తామంటూ లక్షల కోట్ల అప్పులకుప్పగా, మాఫియా రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారా.. లేదా.. అని ప్రశ్నించారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పి ఆఖరికి వారికి మెట్రో రాకుండా చేశారని, ఎంఐఎంకు కేసీఆర్ వంతపాడుతూ ఇక్కడి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment