సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరించే పనిలో ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో భట్టి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. వెంటనే గ్రామాల్లో, మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్లే గజ్వేల్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. టీఆర్‌ఎస్ అనే ఫ్యూడల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని.. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువయిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితులపై సిరిసిల్ల దగ్గర మొదలుకొని గజ్వేల్ నుంచి రాజాపూర్ వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా కరువయింది.. ఈ దాడుల గురించి గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా గవర్నర్‌ను నేరుగా కలవకుండా మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment