చండీగఢ్/న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ ఈ నెల 16న పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన నవన్‌షార్ జిల్లాలోని ఖట్కార్ కలాన్‌ను ప్రమాణ స్వీకారానికి వేదికగా నిర్ణయించుకున్నారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌ను కలిశారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భేటీలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి రాఘవ్ చద్ధా కూడా పాల్గొన్నారు. 13న కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి అమృత్‌సర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారని ఆప్ వర్గాలు తెలిపాయి. మాన్ పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని, తనకు ఆహ్వానం అందజేశారని కేజ్రివాల్ ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రిగా పంజాబ్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారన్న విశ్వాసముందని వెల్లడించారు. ఆయనతో భేటీకి సంబంధించిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. భగవంత్ మాన్ ధూరీ నుంచి తన సమీప ప్రత్యర్థిపై 58,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
థ్యాంక్యూ మోదీ సర్: కేజ్రివాల్
పంజాబ్‌లో ఆప్ ఘన విజయంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పంజాబ్ సంక్షేమానికి కేంద్రం నుంచి సహకారం అందిస్తానంటూ ట్వీట్ చేశారు. దీనికి థ్యాంక్యూ సర్ అంటూ కేజ్రివాల్ బదులిచ్చారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని కోరారు. ఎన్నికలు వాయిదా వేస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment