మధిర: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించనున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క కోరారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం బజారహత్నూర్ మండలం పిప్పిరి నుంచి ప్రారంభమయ్యే తన పాదయాత్ర 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,365 కిలోమీటర్ల మేర సాగి ఖమ్మంలో ముగుస్తుందని తెలిపారు. ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త శక్తి మేరకు తనతో నాలుగు అడుగులు వేసి పారీ్టకి జవసత్వాలు తీసుకొచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవమే నినాదాలుగా సాధించుకున్న తెలంగాణలో సమస్యలు కాంగ్రెస్‌తోనే పరిష్కారమవుతాయన్న విషయాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తానని భట్టి తెలిపారు.
మూడు బహిరంగ సభలు
పాదయాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు భట్టి తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్ శివారుతో పాటు ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభలు ఉంటాయని చెప్పారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు, అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్తోందని.. తన యాత్రలో ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొనాలని కోరారు.
ఇదీ రూట్ మ్యాప్..
ఈనెల 16వ తేదీన మొదలుకానున్న తన పాదయాత్ర రూట్ మ్యాప్ వివరాలను భట్టి వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే యాత్ర ఖానా పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్‌పూర్, జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, ముదిగొండ, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లెందు మీదుగా ఖమ్మం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో పాటు నాయకులు చావా వేణు, సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment